American Aid To Pakistan : పాకిస్థాన్‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన 'డోనాల్డ్ ల్యూ'కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌కు సాయం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ల్యూ సహా మరికొంత మంది ఉన్నతాధికారులతో భారత్, అమెరికా మధ్య సెప్టెంబరు 7, 8 తేదీల్లో 2+2 ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆ మరుసటి రోజే పాక్‌కు అగ్రరాజ్యం సాయమందించాలని నిర్ణయించడం గమనార్హం.
పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్, ఇంజిన్ హార్డ్‌వేర్ ఆధునికీకరణ, ఎలక్టాన్రిక్ పోరాట సామర్థ్యం తదితరాలను సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. ఈ ఒప్పంద విలువ 45 కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌కు తోడ్పాటునివ్వడం ఈ నిర్ణయం వెనుక ముఖ్యోద్దేశమని అగ్రరాజ్యం తెలిపింది.
అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్ వర్క్ తదితర ఉగ్రవాద బృందాలను అణచివేయడంలో పాక్ విఫలమైనందుకు 2018లో డోనాల్డ్ ట్రంప్ సర్కారు పాకిస్థాన్‌కు 200 కోట్ల డాలర్ల భద్రతా సంబంధ సహాయాన్ని నిలిపేసింది. తాజాగా జో బైడెన్ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది. పాక్‌కు ఇప్పుడు అందిస్తున్న సహాయంలో కొత్త ఆయుధాలు కానీ, కొత్త బాంబులు, క్షిపణులు కానీ ఉండవనీ, ఎఫ్ 16లకు కొత్త పోరాట సామర్థ్యాన్ని సమకూర్చడమూ జరగదని తమ కాంగ్రెస్ (పార్లమెంటు)కు బైడెన్ సర్కారు తెలియజేసింది. దీనివల్ల దక్షిణాసియా ప్రాంతంలో బలాబలాల సమతూకంలోనూ మార్పు రాదని వివరించింది. ఉగ్రవాదంపై ప్రస్తుత, భావి పోరులో అమెరికా, నాటో దళాలతో కలసిపనిచేయడానికి పాకిస్థాన్‌కు ఈ సహాయం ఉపకరిస్తుందని తెలిపింది.
ఇవీ చదవండి: మొహంజోదారోకు ముప్పు.. ఇలా అయితే కష్టమే!