ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఆరోగ్య సంస్థ తయారుచేసిన నివేదిక స్వతంత్ర మూల్యాంకనాన్ని వీలైనంత త్వరగా ప్రారంభిస్తానని ప్రతిజ్ఞ చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో కరోనా వైరస్‌కు సంబంధించి ఐరాస సమీక్షపై.. 11 పేజీల నివేదికను ప్రచురించింది స్వతంత్ర పర్యవేక్షణ సలహా సంస్థ. అనంతరం ప్రతిజ్ఞ చేశారు అధనామ్.
కరోనా మహమ్మారి వ్యాప్తి గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడానికి డబ్లూహెచ్ఓ హెచ్చరిక వ్వవస్థ సరిపోతుందా? వంటి ప్రశ్నలు లేవనెత్తింది నివేదిక. దేశాలకు ప్రయాణ సలహాలను అందించడంలో డబ్ల్యూహెచ్ఓ పాత్రను పునఃపరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని సభ్య దేశాలకు సూచించింది.
స్వతంత్ర సలహా సంస్థ సమీక్ష చేస్తున్న సిఫార్సులు.. అమెరికా పారిపాలనా విభాగాన్ని శాంతింపజేసేలా లేవు. కరోనా నియంత్రణలో డబ్ల్యూహెచ్ఓ పాత్రపై డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చైనా ప్రయాణికులపై నిషేధం విధిస్తామంటే అనుమతించలేదని విమర్శలు చేశారు. డబ్లూహెచ్ఓకు నిధులు కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా స్పందన ఎలా ఉండబోతుందోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమీక్ష డబ్ల్యూహెచ్ఓ ప్రతిస్పందన సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చని పలు దేశాలు భావిస్తున్నాయి.
కరోనా మహమ్మారి మూలాన్ని కనుగొనేందుకు స్వతంత్ర, సమగ్ర దర్యాప్తు జరగాలని 73వ ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఐరోపా సమాఖ్య ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. భారత్ సహా 120 దేశాలు మద్దతు తెలిపాయి. వైరస్ మూలంపై విచారణను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న చైనా కూడా మద్దతు తెలిపింది.