కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ను కనీసం రెండు రోజుల పాటు నిరోధించే ఒక నాసల్ స్ప్రేను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దీన్ని ముక్కులో వేసుకుంటే మహమ్మారి నుంచి తాత్కాలికంగా రక్షణ లభిస్తుంది. ఈ మందును భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొద్ది నెలల్లోనే అది ఔషధ దుకాణాల్లో అందుబాటులోకి వస్తుంది. బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. భౌతిక దూరానికి సంబంధించిన నిబంధనల నుంచి ఇది సమాజానికి ఉపశమనం కల్పిస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన రిచర్డ్ మోక్స్ తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి వీలు కల్పిస్తుందన్నారు.
ఇప్పటికే అనుమతి పొందిన పదార్థాలతో దీన్ని అభివృద్ధి చేశారు. అందువల్ల దీన్ని సురక్షితంగా వాడొచ్చని, ఎలాంటి అనుమతులూ అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ముక్కులోకి చేరిన వైరస్ను ఈ ఔషధం పట్టేస్తుంది. దాన్ని ఒక పూతలో బంధించేస్తుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ కలిగించలేదు. సదరు వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోకి ప్రవేశించినప్పటికీ అతడిలోనూ అది ఇన్ఫెక్షన్ కలిగించలేదు. 48 గంటల పాటు ఇది కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ రక్షణ కోసం రోజుకు నాలుగుసార్లు ఈ స్ప్రేను వాడితే సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి:చిన్నారుల కళ్లకు శానిటైజర్ల ముప్పు!