ప్రపంచవ్యాప్తంగా సిక్కులు గురునానక్ 551వ జయంతిని ఘనంగా జరుపుకొంటున్న వేళ.. ఆ మహోన్నతుడికి లండన్లో సముచిత గౌరవం దక్కింది. లండన్లో సిక్కులు అధికంగా ఉండే సౌతాల్లో గల ఓ రోడ్డుకు గురునానక్ పేరును పెట్టేందుకు వెస్ట్ లండన్ కౌన్సిల్ సోమవారం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా చారిత్రక హావ్లాక్ రోడ్డుకు గురునానక్ పేరు పెట్టనున్నారు.
నగరంలోని భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా లండన్లో చారిత్రక ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టాలని మేయర్ సాధిక్ ఖాన్ ఓ కమిషన్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. గురునానక్ పేరును ఓ రోడ్డుకు పెట్టాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పేరు అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
నగరంలోని పెద్ద గురుద్వారాల్లో ఒకటైన శ్రీ గురుసింగ్ సభ సౌతాల్ సమీపంలో ఈ రోడ్డు ఉంది.
ఇదీ చూడండి: స్వర్ణదేవాలయంలో సిక్కులు ప్రత్యేక పూజలు