కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో ఇటలీ రాజధాని రోమ్ వేదికగా జరగనున్న (G-20 summit news) జీ-20 శిఖరాగ్ర సదస్సుకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. నేడు, రేపు (రెండు రోజుల పాటు) జరిగే ఈ సదస్సులో 20 మందికి పైగా ముఖ్య దేశాధినేతలు పాల్గొననున్నారు. వీరితోపాటు పలు అంతర్జాతీయ వేదికల ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల అధినేతలు, సీనియర్ మంత్రులు హాజరు కానున్నారు. ఈ ఏడాది సమ్మేళనానికి 'పౌరులు, భూమి, శ్రేయస్సు (పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ- ట్రిపుల్ 'పి')' అన్న నినాదాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించడం, భూతాపాన్ని నివారించే మార్గాలను అన్వేషించడం, విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ ఐక్యంగా ముందడుగు వేయాలన్నది ఇందులోని అంతస్సూత్రం. వర్తమాన పరిస్థితులకు అద్దంపట్టేలా అజెండాను సిద్ధం చేసినా- ఆలోచనల మార్పిడిలో, ఆచరణలో అది ప్రతిఫలించినప్పుడే ఆ ఆశయం నెరవేరుతుంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన పునరావృతమైన దరిమిలా, అక్కడ మానవ హక్కుల హననాన్ని అరికట్టడం కూటమి ముందున్న కర్తవ్యం. ఉగ్రవాదంపై పోరులో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. ప్రపంచంలో అయిదో వంతు కర్బన ఉద్గారాలకు కారణమవుతున్న అభివృద్ధి చెందిన దేశాలు విరుగుడు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత తీసుకోవాలి.
ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యం
ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా (G-20 summit importance) 20వ శతాబ్దపు తుది నాళ్లలో పురుడుపోసుకున్న జీ-20 కూటమి, నేడు అంతర్జాతీయ యవనికపై కీలక భూమిక పోషిస్తోంది. 19 సభ్యదేశాలకు తోడుగా, ఐరోపా యూనియన్‌తో కలిసి జీ-20గా అవతరించింది. జనాభా పరంగా 70శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ మొత్తం జీడీపీలో సింహభాగం ఈ దేశాలదే. ప్రపంచ వాణిజ్యంలో 80శాతం ఈ దేశాల మధ్యే జరుగుతోంది. ఏటా ఒక్కో దేశం అధ్యక్ష స్థానంలో ఉండి, శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. గతేడాది సౌదీ రాజధాని రియాద్‌లో అగ్రనేతలు భేటీ కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వర్చువల్ ప్రసంగాలకే పరిమితమయ్యారు. ఈ దఫా ఇటలీ ఆతిథ్యమిస్తుండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు నేతలు హాజరవుతున్నారు. వ్యూహాత్మకంగా గైర్హాజరీ ప్రకటించిన జిన్‌పింగ్, చైనా తరఫున ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణను తలపెట్టాల్సిన కీలక తరుణంలో జిన్‌పింగ్ గైర్హాజరు విమర్శలకు తావిచ్చేలా ఉంది. రష్యాలో కరోనా విజృంభించిన తరుణంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నట్లు ఇప్పటికే పుతిన్ ప్రకటించినా, తెరవెనక కారణాలు కొట్టిపారేయలేనివి. ఇతర ముఖ్య దేశాలైన బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, అర్జెంటీనా, ఇండొనేసియా, మెక్సికో, టర్కీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, సౌదీ అరేబియా తదితర దేశాధినేతలు స్వయంగా పాల్గొననున్నారు. ఐరోపా యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఒపెక్, ఏసియాన్ తదితర కూటముల ప్రతినిధులు రోమ్ చేరుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బ్రునై, కాంగో, నెదర్లాండ్స్, సింగపూర్, రువాండా, స్పెయిన్ దేశాధినేతలకు ఆతిథ్యం దక్కనుంది. ఈ సదస్సుకు పూర్వరంగంగా ఇప్పటికే భాగస్వామ్య దేశాల ఆర్థిక, వాణిజ్య మంత్రులు, ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల గవర్నర్లు పలుమార్లు సమావేశమయ్యారు. ప్రధాన అజెండాతో పాటు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్యానికి బాసటగా నిలిచే చర్యలు చేపట్టడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై కూటమి దృష్టి సారించాలని మంత్రుల స్థాయి సమావేశాల్లో తీర్మానించారు. మహమ్మారులు ప్రబలినప్పుడు జీ-20 కూటమి గతంలో క్రియాశీలంగా స్పందించింది. 2014లో పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాధి సంక్రమించినప్పుడు బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) సదస్సు ఆయా దేశాలకు మందుల పంపిణీని అమలు చేయించింది. వ్యాక్సిన్ల తయారీలో పేటెంట్ హక్కులపై ఉదారంగా వ్యవహరించడం, దేశాల మధ్య ప్రజల రాకపోకలు, లాక్‌డౌన్ ఆంక్షలపై పరస్పర అవగాహనతో మెలిగినప్పుడే కరోనా మహమ్మారిపై పోరులో ఐక్యత సాకారమవుతుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునర్వినియోగం, పునరుత్పాదన చేయడంపై పరిశోధనలకు భాగస్వామ్య దేశాలు పెద్దపీట వేయాల్సి ఉంది. సౌరశక్తి, హరిత హైడ్రోజన్ వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
వాణిజ్యమే ప్రధానాంశం
ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న ఈ దేశాలు కొంతకాలంగా స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించడం ప్రపంచ ఆర్థిక మందగమనానికి కారణమవుతోంది. పన్నుల విధానంలో సంస్కరణలు చేపట్టి, విశాల ప్రయోజనాలే ప్రాతిపదికగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహానికి వీలు కల్పించే ద్రవ్య విధానాల రూపకల్పనపై కూటమి దృష్టి సారించాలి. బైడెన్ వచ్చాక చైనాతో ప్రచ్ఛన్న పోరుకు తెరపడుతున్నట్లు కనిపిస్తున్నా, ఇతర అంతర్జాతీయ అంశాలు ఆర్థిక ఒప్పందాలకు అవరోధంగా నిలుస్తున్నాయి. బ్రెగ్జిట్ తరవాత బ్రిటన్ ప్రభావం తగ్గింది. 2020 నుంచి నెలల తరబడి లాక్‌డౌన్‌లో మగ్గిన కారణంగా అన్ని దేశాలూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పారిశ్రామిక, పర్యాటక రంగాలపై ఎక్కువగా ఆధారపడిన ఐరోపా దేశాలు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. ఎగుమతులు మందగించాయి. నిరుద్యోగిత పెరిగింది. అమెరికా సైతం కరోనా రెండు దశల్లోనూ ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాన్ని చవిచూసింది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఉమ్మడి కృషి జరగాలి. 'భాగస్వామ్య దేశాలతో పాటు కూటమికి ఆవల ఉన్న దేశాల ప్రయోజనాలూ తీర్మానాల్లో ప్రతిఫలించాలి. నిర్ణయాల్లో పారదర్శకత, సుస్థిరత ఉండాలి. పరస్పర విశ్వాసం పాదుకొల్పాలి. ఇవి జీ-20 కూటమి చట్టబద్ధతను పెంచుతాయి' అని గతేడాది ఆతిథ్యమిచ్చిన సందర్భంగా సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆకాంక్షించారు. రోమ్ సదస్సు ఆ పరంపరను కొనసాగిస్తూ, తదుపరి సమావేశాలకు వేదిక కాబోతున్న బాలి(ఇండొనేసియా)కి సరికొత్త అజెండాను నిర్దేశించాలని ఆశిద్దాం.
భారత్ ప్రయోజనాలు
జీ-20 సదస్సుకు ప్రత్యక్షంగా హాజరవుతున్న ప్రధాని మోదీ వివిధ దేశాల అగ్రనేతలతో ద్వైపాక్షిక, బృంద చర్చల్లో పాల్గొననున్నారు. 2022 డిసెంబర్ నుంచి ఏడాదిపాటు జీ-20 కూటమికి అధ్యక్ష బాధ్యత స్వీకరించనున్న ఇండియా, 2023 సదస్సును దిల్లీ వేదికగా నిర్వహించి ప్రపంచ దేశాలకు ఆతిథ్యమివ్వనుంది. 'పన్ను ఎగవేతదారులు దేశాల సరిహద్దులు దాటి తప్పించుకునే మార్గాలను మూసివేయాలి. ఖర్చులు తగ్గించుకునే కొత్త పన్నుల విధానాన్ని రూపొందించుకోవడంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలి. ఇందుకు డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించాలి' అని భారత్ ప్రతిపాదిస్తోంది. వివిధ స్థాయుల్లో జరిగే చర్చలతో ఇండియా తన వాణిజ్య అవకాశాలను మెరుగుపరచుకొంటే, ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
- బోండ్ల అశోక్
ఇదీ చదవండి:రష్యాలో కరోనా మరణమృదంగం..రెండో రోజూ రికార్డు మరణాలు