కరోనా.. ప్రస్తుతం ఈ పేరుకు భయపడనివారే ఉండరు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారికి విరుగుడు కనుగొనేందుకు అన్ని దేశాలు తీవ్ర పోరాటం చేస్తున్నాయి. అయితే కరోనాకు వ్యక్సిన్ తయారు చేసేందుకు 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాసూటికల్ మ్యానుఫ్యాక్టరెర్స్ అండ్ అసోషియేషన్స్ (ఐఎఫ్‌పీఎంఏ) అధ్యక్షుడు డేవిడ్ రిక్స్ తెలిపారు. డేవిడ్ ప్రకటనతో కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరింత కాలం వేచిచూడక తప్పేలాలేదు.
"కరోనా వైరస్‌ను పూర్తిగా అడ్డుకునే సామర్థ్యం ఉందని విశ్వసిస్తున్నాం. వ్యాక్సిన్ తయారు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి అందుబాటులోకి తీసుకురాగలమనేది ప్రస్తుతం మాకొక సవాలు. వాక్సిన్ ఉపయోగించేందుకు అన్ని రకాల భద్రతలు తప్పనిసరిగా పాటించాలి. అందుకే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని భావిస్తున్నాం. అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాత వ్యాక్సిన్‌ను విడుదల చేసి ఆయా దేశాల అవసరాల మేరకు అందిస్తాం."
- డేవిడ్ రిక్స్, ఐఎఫ్‌పీఎంఏ అధ్యక్షుడు
తొందర్లోనే అడ్డుకట్ట
ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తొందర్లోనే దీనికి అడ్డుకట్ట వేస్తామని భావిస్తున్నాయి ప్రపంచ ఔషధ వ్యాపార సంస్థలు. ఇందుకోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాతే వ్యాక్సిన్‌ను వినియోగంలోకి తీసుకొస్తామని ప్రపంచ ఔషధ వ్యాపార సంస్థల అధ్యక్షుడు రాజీవ్ వెంకయ్య స్పష్టం చేశాయి.
" ఈ వ్యాక్సిన్‌ను ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులపై ప్రయోగిస్తాం. ఎందుకంటే ఎవరూ దీనివల్ల అనారోగ్యం పాలవకుండా చూడాల్సిన భాద్యత మాపై ఉంది. మేము అందించే వ్యాక్సిన్‌పై ప్రజలు తప్పక విశ్వాసం కలిగి ఉండాలి. అలా జరగకపోతే అది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. "
- రాజీవ్ వెంకయ్య, ప్రపంచ ఔషధ వ్యాపార సంస్థల అధ్యక్షుడు
ఇదే పెద్ద సమస్య
ఔషధ సంస్థలు తీసుకొచ్చే ప్రతి మందు కచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు పరిశోధకుడు పౌల్ స్టోఫెల్స్. కొవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొనడం పూర్తయిన సమయానికి వేరే లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఫలితంగా వైరస్కు విరుగుడు సిద్ధం చేసేందుకు మరింత సమయం పడుతోందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ ప్రారంభం నుంచి పరిశోధనలు మొదలు పెట్టాల్సి వస్తుందని.. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీలో ఇదో పెద్ద సమస్యగా మారిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైరస్కు విరుగుడు కనిపెట్టే వరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పారు.