కరోనా డెల్టా రకం వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఇంటర్నేషనల్ సైన్స్ జర్నల్ 'నేచర్' తాజా అధ్యయనం ఊరటనిస్తోంది. భారత్‌లో తొలిసారి గుర్తించిన ఈ వేరియంట్ నుంచి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
బీఎన్టీ162బీ2 ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కొవిడ్19పై 95 శాతం సమర్థతతో పనిచేస్తుంది. సార్క్ కొవ్-2ను ఎదుర్కొనేందుకు అవసరమైన రక్షణ వ్యవస్థను ఇది ఏర్పరుస్తుంది.
'అన్ని రకాల కరోనా వేరియంట్లపై ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏ మేరకు రక్షణ కల్పిస్తుందో తెలుసుకునేందుకు గోల్డ్ స్టాండర్డ్ పీఆర్ఎన్టీ50 పరీక్షను ఉపయోగించి వేరియంట్ స్పైక్ జన్యువులను రూపొందించాం. బీఎన్టీ162బీ2 వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సెరా.. కరోనా వేరియంట్లను ఎలా నిర్వీర్యం చేస్తుందో పరిశీలించాం. పరీక్షించిన అన్ని రకాల వైరస్‌లతో పోల్చితే B.1.3514 , B.1.617.1 స్పైక్ ప్రోటీన్ల నిర్వీర్యంలో సెరా ప్రభావశీలత తగ్గింది.' అని నేచర్ జర్నల్ అధ్యయనం పేర్కొంది.
అధ్యయనంలోని కీలక విషయాలు..
- ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో బీఎన్టీ162బీ2 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి B.1.3514 , B.1.617.1 వేరియంట్ల నుంచి 75 శాతం రక్షణ లభించింది. తీవ్ర అనారోగ్యం, మరణం సంభవించకుండా ఈ టీకా 100 శాతం ప్రభావశీలతతో పనిచేసింది.
- B.1.617.1(కప్ప), B.1.617.2 (డెల్టా) వేరియంట్లను తొలిసారిగా భారత్‌లోనే గుర్తించారు. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా వ్యాప్తి చెంది, అధిక మరణాలు సంభవించడానికి డెల్టా వేరియంటే కారణం.
- బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనంలో బీఎన్టీ162బీ2 వ్యాక్సిన్ B.1.617.2 వేరియంట్‌పై 87.9 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. B.1.1.7 రకంపై మాత్రం 93.4 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
- కరోనా ఉన్నంత కాలం కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని పరిశోధన స్పష్టం చేసింది. BNT162b2 వ్యాక్సిన్ల నుంచి ఏ రకం వేరియంటైనా తప్పించుకున్నట్లు ఇప్పటివరకు ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందిస్తేనే కరోనాను త్వరగా అంతం చేయవచ్చని తెలిపింది.
సాధారణ వ్యాక్సిన్లకు, ఎంఆర్ఎన్కు తేడా అదే..
ఏషియన్ సొసైటీ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు డా.తామోరిశ్ కోలే ఈ విషయంపై ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే వ్యాక్సిన్లలో చనిపోయిన లేదా బలహీనమైన వైరస్‌లను ఉపయోగిస్తారని చెప్పారు. వాటి ద్వారా వైరస్‌పై పోరాడే విధంగా రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుందని వివరించారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఇందుకు భిన్నమని, శరీరంలోని సొంత కణాలే వైరల్ ప్రోటీన్లను ఉత్పత్తి చేసి వైరస్‌తో పోరాడేలా ఇవి పని చేస్తాయని పేర్కొన్నారు. దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ ముప్పు ఉండదన్నారు. ఒరిజినల్ వైరస్‌లతో రూపొందించిన వ్యాక్సిన్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
B.1.1.7, B.1.351 వేరియంట్లపై ఫైజర్ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు మే నెలలో ప్రచురితమైన లాన్సెట్, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనాలు స్పష్టం చేశాయని కోలే చెప్పారు. బూస్టర్ డోసుతో ఈ వేరియంట్లపై తమ టీకా కూడా సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైందని మోడెర్నా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రెండు టీకాలను ఎంఆర్ఎన్ఏ విధానంలోనే అభివృద్ధి చేశారు.
భారత్‌లో తయారు చేసిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు కూడా కొత్త వేరియంట్లపై సమర్థంగానే పనిచేస్తున్నట్లు తేలింది. B.1.351, B.1.617.2 రకాలపై కొవిగ్జాన్ ప్రభావశీలత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఈ వైరస్‌లను నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఈ టీకాకు ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది.
కొవాగ్జిన్‌ను ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ పద్ధతిలో తయారు చేయగా కొవిషీల్డ్ టీకాను వైరల్ వెక్టార్ విధానంలో అభివృద్ధి చేశారు.
ఇదీ చూడండి: 'టీకా బూస్టర్ డోస్‌పై ముమ్మర పరిశోధనలు'