కొవిడ్ నివారణకు వినియోగించే ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని ఐర్లాండ్ తాత్కాలికంగా నిలిపివేసింది. నార్వేలో టీకా తీసుకున్న వారికి రక్తంలో సమస్యలు ఎదురైన ఘటనలు వెలుగు చూడగా.. ఈ నిర్ణయం తీసుకుంది.
నార్వేలో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న నలుగురిలో సమస్యలు ఎదురయ్యాయని ఐర్లాండ్ వైద్య శాఖ అధికారి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా పంపిణీని తమ దేశంలోనూ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
నెదర్లాండ్స్‌లోనూ..
నెదర్లాండ్స్‌లోనూ ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. డచ్ ఔషధ నియంత్రణ బోర్డు హెచ్చరికలతో ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా పంపిణీని మార్చ్ 28 వరకు ఆపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే.. డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ సహా ఐరోపా సమాఖ్యలోని చాలా దేశాలు ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశాయి.
ఆధారాల్లేవు..
టీకాపై సందేహాలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ఆస్ట్రాజెనెకా స్పందించింది. స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలతో తమ టీకా భద్రతపై మరోసారి భరోసా కల్పిస్తామని తెలిపింది. ప్రజల భద్రతకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పింది. సమస్యను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు టీకాతోనే సమస్యలు ఏర్పడ్డాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది.
అయితే.. రక్తంలో సమస్యలు ఏర్పడటానికి, వ్యాక్సిన్ వినియోగానికి సంబంధం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, ఐరోపాలోని ఔషధ నియంత్రణ సంస్థలు అంతకుముందు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి:చైనా గబ్బిలాల్లో 24 కొత్త రకం కరోనా వైరస్లు