దగ్గు, జలుబు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, జ్వరం... చాలా మందికి తెలిసిన కరోనా లక్షణాలివే. కానీ... కొన్ని కేసుల్లో మాత్రం రోగులు జీర్ణాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు ఇలా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేశారు లండన్, నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మనుషుల పేగు కణాలకు కొవిడ్-19 ఏవిధంగా సోకుతుంది, పేగుల్లో వైరస్ సంఖ్య ఎలా వృద్ధి చెందుతుందనే విషయాన్ని కనుగొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించి వ్యాసం సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
కరోనా రోగుల్లో మూడింట ఒకటో వంతు మందిలో అతిసారం వంటి లక్షణాలు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. తరచుగా మలం నమూనాలలో వైరస్ కనిపించినట్లు వెల్లడైంది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత చాలా రోజులకు కూడా మలంలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు తెలిపింది. బహిరంగ మలవిసర్జన ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది.
పేగులోని ఆర్గనోయిడ్స్పై పరిశోధన..
కొవిడ్-19 ప్రవేశించేందుకు కారణమయ్యే ఏసీఈ-2 అనే ఎంజైమ్‌లు పేగుల్లో ఎక్కువ మొత్తంలో ఉండటం కూడా వైరస్ సోకేందుకు కారణం కావచ్చని పరిశోధకులు అంచనా వేశారు. అయితే.. వైరస్ సోకేందుకు, వాటి సంఖ్యను పెంచుకునేందుకు పేగు కణాలు సహకరిస్తాయనేది పూర్తిస్థాయిలో తెలియదని చెప్పారు. అందువల్ల.. ప్రయోగశాలలో మానవ పేగులోని ఆర్గనోయిడ్స్పై వైరస్ ఏవిధంగా ప్రభావం చూపుతుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. ఆర్గనోయిడ్స్పై వైరస్‌ను ప్రవేశపెట్టగానే పేగు కణాలు పూర్తిగా ప్రభావితమైనట్లు తేల్చారు. క్రమానుగుణంగా వైరస్ బారిన పడిన కణాల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు.
వైరస్‌కు ఆర్గనోయిడ్ కణాలు ఏవిధంగా స్పందిస్తున్నాయనే అంచనా వేస్తున్న క్రమంలో రోగనిరోధక వ్యవస్థలోని జన్యువులు, ప్రొటీన్లు ఉత్తేజితమైనట్లు కనుగొన్నారు పరిశోధకులు. ఈ జన్యువులు వైరస్ సంక్రమణపై పోరాడతాయని వెల్లడించారు. భవిష్యత్తులో కొత్త రకం చికిత్సలను కనుగొనేందుకు ఈ జన్యువులపై ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
సంక్రమణను అడ్డుకుంటుంది..
ఈ పరిశోధన ఫలితాలు మానవ కణాల్లోకి వైరస్ సంక్రమణను అడ్డుకునేందుకు ఉపయోగపడుతాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
"జీర్ణాశయంలోని కణాల్లో కరోనా వైరస్ తన సంఖ్యను పెంచుకుంటుందని ఈ పరిశోధన ద్వారా రుజువైంది. అయినప్పటికీ.. కరోనా రోగుల పేగుల్లో ఈ వైరస్ ఉందని ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధరణ కాలేదు. కరోనా వ్యాప్తి గురించి మరింత క్షుణ్నంగా తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుంది."
– బార్ట్ హాగ్మ్యాన్స్, సహ రచయిత