ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న చికిత్స విధానాల్లో హెచ్ఐవీ/ ఎయిడ్స్ రోగి ప్రతిరోజూ మూడు రకాల మందులు వేసుకోవాలి. మతిమరుపు, మానసిక స్థితి సరిగ్గా లేనివారు, మత్తు మందులకు అలవాటు పడినవారు, సరైన జీవన విధానం పాటించని వారు క్రమం తప్పకుండా ఈ మందులు వాడడం కష్టం.
దీనికి విరుగుడుగా నేడు సరికొత్త వైద్యం అందుబాటులోకి వచ్చింది. నెలకు కేవలం రెండు యాంటీ రెట్రో వైరల్ ఇంజెక్షన్లు తీసుకుంటే సరిపోతుంది. ఫలితంగా రోగి శరీరంలో హెచ్ఐవీ వైరస్ పెరగకుండా సమర్థవంతంగా నిరోధించవచ్చు. ఫలితంగా హెచ్ఐవీ సోకినవారు సైతం అందరిలాగే సాధారణ జీవితాన్ని అనుభవించగలుగుతారు.
"ఇంతకు మునుపు రోగులు వాడిన హెచ్ఐవీ మందుల వలన కిడ్నీ, ఎముకల సమస్యలు వచ్చేవి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన హెచ్ఐవీ నిరోధక మందులు గర్భిణీలు సైతం తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా సురక్షితం."
- చోలే ఆర్కిన్, హెచ్ఐవీ ఫిజీషియన్, క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం
సరికొత్త పరిశోధనలు...
ప్రస్తుతం 'హెచ్ఐవీ' నిరోధానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రజ్ఞులు 'యూంటీరెట్రో వైరల్ థెరపీ లాంగ్ యాక్టింగ్ అప్రెషన్' (ఏటీఎల్ఏఎస్), ఫస్ట్ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్ రెజిమెన్ (ఎఫ్ఎల్ఏఐఆర్) విధానాలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో సుమారు 11 వందల మంది స్త్రీ,పురుషులు పాల్గొన్నారు. వీరికి టాబ్లెట్లకు బదులు, ప్రతి రెండు నెలలకు ఒకసారి రెండు ఇంజెక్షన్లు ఇస్తారు. వీటిని క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల హెచ్ఐవీ వైరస్ వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
"రోగిలోని హెచ్ఐవీని పూర్తిగా నిరోధించగలిగితే, ఇక ఎంతమాత్రమూ అతనికి ఎయిడ్స్ సంక్రమించదు. అతను పూర్తి ఆరోగ్యకర జీవితం గడపగలుగుతాడు. అయితే అతను/ఆమె క్రమం తప్పకుండామందులు వాడాల్సి ఉంటుంది."_ గ్రాహమ్ కుక్, అంటువ్యాధుల నిపుణుడు, ఇంపీరియల్ కాలేజ్, లండన్
ఈ సరికొత్త మందులు కొంతమందిలో హైపర్ సెన్సిటివిటీ, డిప్రెషన్ కలిగిస్తున్నట్లు పరిశోధకులు గ్రహించారు. అయితే ఈ లక్షణాలు కేవలం 3 శాతం రోగుల్లో మాత్రమే కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
ఆమోదించాల్సి ఉంది...
లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా శాస్త్రజ్ఞులు ఈ హెచ్ఐవీ, ఎయిడ్స్ నిరోధక పరిశోధనలను చేపట్టారు. దిగ్గజ ఫార్మా సంస్థలు జీఎస్కే, పీ ఫైజర్లు సంయుక్తంగా నెలకొల్పిన వీఐఐవీ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. వీరు తయారుచేసిన ఇంజెక్షన్‌ను 'ఎఫ్‌డీఏ' (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) (అమెరికా), యూరోపియన్ మెడికల్ ఏజెన్సీలు ఆమోదించాల్సి ఉంది.