కరోనా (కొవిడ్-19)... చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడిది ఐరోపావాసులకు కొత్త తంటా తెచ్చిపెట్టింది. అదేంటంటే...
భారత్‌లో గౌరవ సూచికంగా నమస్కారం పెట్టడం సాధారణం. విదేశాల్లో, ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఫ్రెండ్లీ కిస్, డబుల్ చీక్ కిస్, కరచాలనం, ఆలింగనంతో గ్రీట్ చేసుకోవడం మామూలే. ఇప్పుడిదే అక్కడ కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. దానికి కారణం కరోనా వైరస్.
ఇటీవల జరిగిన ఫ్రాన్స్, ఇటలీ దేశాధినేతల భేటీలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ప్రధాని గిసెప్పె కొంటె మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటలీ ప్రధానికి డబుల్ చీక్ కిస్ ఇచ్చేందుకు మేక్రాన్ రెండుసార్లు ప్రయత్నించగా.. ఇరువురి మధ్య కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.
విదేశీ సంస్కృతిలో భాగమైన కరచాలనం, ఆలింగనం, ఫ్రెండ్లీ కిస్సింగ్‌లు కరోనా వ్యాప్తిని మరింత పెంచుతున్నాయి. ఇటలీలో ఇప్పటికే 34 మంది మరణించగా.. 1500 మందికిపైగా వైరస్ సోకింది. ఫ్రాన్స్‌లో కరోనా ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 100కుపైగా కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఫ్రెండ్లీ కిస్‌లు, కరచాలనానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- ఇదీ చూడండి: 'మోటేరా సభ చూసిన తర్వాత ఏదీ పెద్దదిగా లేదు'