కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ప్రజలందరికీ ముఖాలకు మాస్కులు అతుక్కుపోయాయి. మాస్కు ముఖానికి లేనిదే అడుగు బయటే పెట్టట్లేదు. వైద్యసిబ్బంది సంగతైతే చెప్పనక్కర్లేదు. ఇటీవల చైనాలో, ఇటలీలో వైద్యసిబ్బంది ముఖాలకు పడిన అచ్చులే ఇందుకు నిదర్శనం.
ప్రపంచమంతా సాంకేతిక యుగంతో పోటీపడుతోంది. 5జీ అంది పుచ్చుకున్నాం. 3-డీ నుంచి 8-డీ వరకు టెక్నాలజీలో దూసుకుపోతున్నాం. ఇలాంటి తరుణంలో మనం వాడే మాస్కులు ఎందుకు 3-డీలో రూపొందించలేము? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఐరోపాలోని ఓ దేశం ఇందుకు శ్రీకారం చుట్టింది.
వైద్య సిబ్బంది రక్షణ కోసం..
కరోనా మహమ్మారిని అరికట్టడానికి కృషి చేస్తున్న వైద్యసిబ్బందికి మరింత అత్యాధునిక రక్షణ వస్తువులు ఇవ్వాలని బోస్నియా అండ్ హెర్జెగోవినా దేశం ఆలోచించింది. ఈ ఆలోచనలో నుంచే 3-డీ మాస్కుల రూపకల్పన జీవం పోసుకుంది. ఇప్పటికే ఆ దేశంలో 3-డీ ప్రింటెడ్ మాస్కులు అందుబాటులోకి వచ్చాయి.
తక్కువ సమయంలోనే..
కరోనాను ఎదుర్కోవడానికి 3-డీ ప్రింటెడ్ మాస్కులను తయారుచేయాలని ఆ దేశంలోని విశ్వవిద్యాలయాలకు, అంకుర సంస్థలకు విజ్ఞప్తి చేసింది బోస్నియా అండ్ హెర్జెగోవినా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో "ద ఆర్ట్ సంస్థ" 3-డీ మాస్కులకు ఆయువు పోసింది. అతి తక్కువ సమయంలోనే డిజైన్ చేసి అందించింది.
దేశంలో ఉన్న వైద్యసిబ్బంది కోసం వీటిని యుద్ధప్రతిపాదికన తయారు చేయమని ఆ దేశప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా ఈ సంస్థ 3-డీ మాస్కుల ఉత్పత్తితో పాటు ఇతర సంస్థలకు వీటిపై శిక్షణనిస్తోంది.
3-డీ మాస్కుల ఉపయోగాలు..
ప్రస్తుతం ఉన్న మాస్కులను గంటలపాటు ధరించడం వల్ల ముఖంపై ఆ మాస్కు అచ్చులు పడతాయి. చైనా, ఇటలీలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఫొటోలే ఇందుకు నిదర్శనం. వీటికి ప్రత్యామ్నాయంగా సౌకర్యవంతంగా వాడగలిగివే 3-డీ మాస్కులు.
వీటి వల్ల మూఖంపై అచ్చులు పడవు. మనం ముఖానికి ఎదో అంటుకుంది అనే భావన ఉండదు. చక్కగా గాలి పీల్చుకోవచ్చు. అన్నింటికంటే మించి ఇవి ఎన్-95 మాస్కుల కంటే అత్యంత రక్షణతో కూడుకున్నాయి. ఫలితంగా, కరోనా కట్టడిలో పాటుపడుతున్న వారందరూ పటిష్ఠమైన రక్షణతో పాటు సౌకర్యవంతంగా పని చేయొచ్చు.
4 వేల ఆర్డర్లు..
త్రీడీ మాస్కుల గురించి తెలియగానే 'ద ఆర్ట్ సంస్థ'కు 24 గంటల్లోనే దాదాపుగా 4 వేల ఆర్డర్లు వచ్చాయి. ఇప్పటికే 400 3-డీ మాస్కులను ఈ సంస్థ ఉత్పత్తి చేసింది. రానున్న రోజుల్లో వీటి ఉత్పత్తి భారీగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలకూ అందుబాటులో ఉంచాలనుకుంటోంది. మొదటగా కరోనా కట్టడికి శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి 3-డీ మాస్కులను అందజేయనుంది.
మరో దేశమూ..
ఐరోపాలోని జెకియా దేశం కూడా 3-డీ ప్రింటింగ్ మాస్కులు తయారీలో ముందుంది. ఇప్పటికే ఆ దేశంలో వైద్యసిబ్బందికి వాటినే వాడుతున్నారు. సాధారణ మాస్కులతో పోల్చితే 3-డీ ప్రింటింగ్ మాస్కుల తయారీ చాలా ఖర్చుతో కూడుకున్నది. సమయం ఎక్కువగా పడుతుంది. ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండడం వల్ల వీటి ఎగుమతి కష్టం. అందుకే జెకియా ఈ 3-డీ ప్రింటింగ్ మాస్కుల డిజైన్‌ను ఉచితంగా ఆన్‌లైన్‌లో అందిస్తుంది. ఫలితంగా, 3-డీ ప్రింటర్ మన చెంత ఉంటే కొన్ని గంటల్లో తయారు చేయవచ్చు.
3-డీ వెంటిలేటర్లూ..
కరోనాను కట్టడికి చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు సాంకేతికను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచానికి నేడు ఆదర్శంగా నిలుస్తున్న తైవాన్, దక్షిణ కొరియా దేశాలు సాంకేతికతను ఉపయోగించే కరోనాను కట్టడిచేశాయి. ఇప్పటికే పలు దేశాలు ఒక వెంటిలేటర్‌తో ఇద్దరు రోగులకు చికిత్స అందించేలా ప్రయోగాలు చేస్తున్నాయి. 3-డీ వెంటిలేటర్ రూపొందించే ప్రయత్నంలో ఉన్నాయి. మరింత భారీ స్థాయిలో సాంకేతికతను ఉపయోగించుకొని కరోనాను నిర్మూలించడానికి అన్ని దేశాలు నడుం బిగించాలి.
ఇదీ చూడండి: 'సామాజిక దూరం కాదు భౌతిక దూరం పాటించాలి!'