ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్'(Bharat BioTech Covaxin) టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో(ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్-ఈయూఎల్) చేర్చే అంశంపై 4-6 వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. టీకా పూర్తి సమాచారాన్ని భారత్ బయోటెక్ డబ్ల్యూహెచ్‌ఓ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిందని, ఆ డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.
"ఈయూఎల్‌లో చేర్చేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. తయారీ సంస్థలు టీకాల మూడు దశల ప్రయోగాలను పూర్తిచేయాలి. ఆ డేటాను డబ్ల్యూహెచ్‌ఓ రెగ్యులేటరీ విభాగానికి సమర్పించారు. తర్వాత నిపుణుల కమిటీ దాన్ని విశ్లేషిస్తుంది. కొవాగ్జిన్‌కు సంబంధించిన డేటాను భారత్ బయోటెక్ సమర్పించింది. మా నిపుణుల కమిటీ పరిశీలించే తర్వాతి వ్యాక్సిన్ ఇదే. మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి."
-- సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్ఓ
ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో నూతన లేదా లైసెన్సు లేని ఔషధాలు/ టీకాలను ఒక క్రమపద్ధతిలో వినియోగించడానికి ఈయూఎల్ నిబంధనలను డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొచ్చింది.
ఇప్పటివరకు 5 సంస్థల కరోనా టీకాలకు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర అనుమతి లభించింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, సినోఫార్మ్, సినోవ్యాక్ టీకాలు ఈయూఎల్ జాబితాలో ఉన్నాయి.
ఇదీ చదవండి : 'మూడో దశ ముందే వచ్చాం.. భయమెందుకు?'