కొవిడ్-19 అత్యవసర పరిస్థితి కారణంగా యువత విద్య, శిక్షణపై తీవ్ర ప్రభావం పడినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) వెల్లడించింది. కరోనా విలయం ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలలు, కళాశాలలు ముసివేయడం వల్ల 70శాతం మంది యువత చదువులు దెబ్బతిన్నట్లు నివేదికలో తెలిపింది. ఒక తరం యువత ఉత్పాదక సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంది.
'యూత్ అండ్ కొవిడ్-19' పేరుతో రూపొందించిన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది ఐఎల్వో. కరోనా కారణంగా యువత ఉద్యోగాలు, విద్య, హక్కులు, మానసిక శ్రేయస్సుపై అసమాన ప్రభావం పడినట్లు పేర్కొంది. తరగతి గదులను ఆన్లైన్(వెబ్)లోకి మార్చడం వల్ల తక్కువ నేర్చుకున్నట్లు 65శాతం మంది విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిపింది. వారిలో సగం శాతం మంది పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. 9 శాతం మంది తక్కువ మార్కులు సాధిస్తామని అనుకుంటున్నారు.
ఇంటర్నెట్ సౌకర్యం, పరికరాల కొరత, ఇంట్లో సరిపడా చోటు లేని అల్పాదాయ దేశాల యువత పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అధిక ఆదాయం ఉన్న దేశాల్లో 65శాతం మంది యువతకు వీడియో క్లాసులు నిర్వహిస్తే.. అల్పాదాయ దేశాల్లో కేవలం 18 శాతం మంది యువతే ఆన్లైన్ ద్వారా చదువుకుంటున్నారని పేర్కొంది.