కరోనా వైరస్‌కు సంబంధించి వేగంగా స్పందించిందని చైనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జనవరిలో ప్రశంసలు కురిపించింది. వైరస్ జన్యుపటాన్ని గుర్తించిన వెంటనే వివరాలను అందించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపింది.
కానీ తాజాగా వెలుగు చూసిన వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించిన రెండు వారాల తర్వాత డబ్ల్యూహెచ్ఓకు చైనా సమాచారం ఇచ్చినట్లు బయటపడింది.
ఇందుకు సంబంధించిన అంతర్గత పత్రాలు, ఈమెయిళ్లు, కొంతమంది అధికారుల ఇంటర్వ్యూలు అమెరికాకు చెందిన వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్‌కు లభించాయి.
వీటి ప్రకారం..
చైనా ప్రభుత్వ పరిశోధనశాలలు పలుసార్లు వైరస్ జన్యుక్రమాన్ని డీకోడ్ చేసి నిర్ధరించుకున్నాయి. అంతవరకు ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీకి కీలకమైన వివరాలను పంచుకోకుండా అధికారులు జాప్యం చేసినట్లు వెల్లడైంది. చైనా ప్రజారోగ్య వ్యవస్థలో పోటీతత్వం, సమాచార వితరణపై కఠిన నియంత్రణలే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
తొలుత చైనాకు చెందిన ఓ పరిశోధనశాల వైరస్ జన్యుక్రమాన్ని వెల్లడించింది. అనంతరం జనవరి 11న వైరాలజీ వెబ్సైట్లో చైనా అధికారులు కరోనా వివరాలను ప్రచురించారు. అంటే డబ్ల్యూహెచ్ఓకు అందివ్వాల్సిన వివరాలను రెండు వారాల పాటు నిలిపేసింది చైనా. ఈ విషయాలు డబ్ల్యూహెచ్ఓ జనవరిలో అంతర్గతంగా నిర్వహించిన సమావేశాల రికార్డులు తెలియజేస్తున్నాయి.
డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..
కొత్తగా ఉద్భవించిన ఈ వైరస్‌కు సంబంధించి సమాచారం చేరవేయటంలో చైనా చేసిన ఆలస్యంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. "జాప్యం కారణంగా ప్రస్తుతం ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోంది. చైనాకు చెందిన మీడియా సంస్థ సీసీటీవీలో జన్యు వివరాలు ప్రసారం కావటానికి 15 నిమిషాల ముందు మాకు సమాచారం ఇచ్చారు" అని చైనాలో డబ్ల్యూహెచ్ఓ ఉన్నత అధికారి డాక్టర్ గౌడెన్ గలీయో ఓ సమావేశంలో చెప్పారు.
అయినా చైనాకే మద్దతు..
ఇంత జరిగినా చైనాను కాపాడే ధోరణిలో డబ్ల్యూహెచ్ఓ వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనాపై స్పందన విషయంలో డబ్ల్యూహెచ్ఓ చైనాకు మద్దతు పలికిందని ఆరోపిస్తున్నారు. చైనాతో కలిసి డబ్ల్యూహెచ్ఏ వైరస్ వివరాలు దాచిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
చైనా వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. డబ్ల్యూహెచ్ఓకు కావాల్సిన సమాచారం చైనా ఎప్పటికప్పుడు చేరవేసిందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెబుతూ వస్తున్నారు. తాజాగా బయటపడ్డ వివరాలను బట్టి రెండు దేశాల వాదనల్లో నిజం లేదని తెలుస్తోంది. కానీ, వీరిద్దరి మధ్య నలిగిపోయిన డబ్ల్యూహెచ్ఓ మరింత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తోంది.
ఒత్తిడి చేయలేదు..
ప్రజారోగ్యంపై ప్రభావం చూపే వివరాలను డబ్ల్యూహెచ్ఓకు నిర్బంధంగా నివేదించాలని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి. అయితే దీన్ని అమలు చేసే అధికారం డబ్ల్యూహెచ్ఓకు లేదు. సభ్య దేశాల సహకారంపైనే ఈ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.
కరోనా వైరస్ విషయంలో చైనా కూడా ఇదే రీతిలో వ్యవహరించినట్లు ఏపీ వార్తాసంస్థ గుర్తించింది. చైనా కొద్దిపాటి సమాచారం అందివ్వటం వల్ల డబ్ల్యూహెచ్ఓకు వైరస్‌పై పూర్తి అవగాహన రాలేదు. అయితే పూర్తి వివరాల కోసం డబ్ల్యూహెచ్ఓ చైనాపై ఒత్తిడి తీసుకుని వస్తే పరిస్థితి వేరేలా ఉండేది.
చైనా అధికారులు, శాస్త్రవేత్తలకు ఇబ్బందులు కలగకుండా వైరస్ సమాచారాన్ని ఎలా రాబట్టాలన్న విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ వాళ్లనే డబ్ల్యూహెచ్ఓ తిరిగి ప్రశంసించింది.
"స్వతంత్ర విశ్లేషణ చేయటంపై చైనాను అభినందించటమే మన ముందున్న మార్గం. ఎందుకంటే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తిస్తుందన్న విషయం వారి కృషితోనే బహిర్గతమైంది. లేదా ఎవరికి వారు చర్యలు తీసుకోవాల్సి వచ్చేది."
- మైఖేల్ రియాన్, డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్
ఇంత ఆలస్యమా..
రెట్రోస్పెక్టివ్ చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సమాచారం ప్రకారం కరోనా వైరస్‌ను జనవరి 2న మొదటిసారి విశ్లేషించారు. కానీ జనవరి 30న అంతర్జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. ఈ మధ్య కాలంలో వైరస్ వ్యాప్తి 200 రెట్లు పెరిగింది.
అయితే ఈ అంశాలపై డబ్ల్యూహెచ్ఓను ఏపీ వార్తా సంస్థ సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించింది. అన్ని దేశాలకు వైరస్ వివరాలు అందించేందుకు రాత్రి పగలు కష్టపడి పనిచేశామని మాత్రం ప్రకటన చేశారు. చైనా కూడా దీనిపై స్పందించలేదు. అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు చేస్తోన్నా తన చర్యలను సమర్థించుకుంటూ వస్తోంది చైనా.
అప్పుడే గుర్తించినా..
గతేడాది డిసెంబర్లో కొంతమంది రోగుల్లో అసాధారణ నిమోనియా లక్షణాలను గుర్తించారు. ఈ శాంపిళ్లను డిసెంబర్ 27 పరిశోధనశాలకు పంపారు. విజన్ మెడికల్స్ అనే సంస్థ ఈ వైరస్ సార్స్ తరహా లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. వెంటనే వుహాన్ అధికారులను అప్రమత్తం చేయగా ఒక రోజు తర్వాత అంతర్గత హెచ్చరికలు జారీ చేశారు.
వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని ప్రముఖ కరోనా వైరస్ నిపుణుడు షీ ఝెంగ్లీ డిసెంబర్ 30న ఈ వ్యాధికి సంబంధించి ప్రాథమిక హెచ్చరికలు చేశారు. జనవరి 2న వైరస్‌ను పూర్తిగా డీకోడ్ చేశారు. కానీ ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేయటంలో చాలా జాప్యం జరిగింది.
ప్రభుత్వ అనుమతి లేనిదే వైరస్ వివరాలను వెల్లడించవద్దని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ రహస్య నోటీసును జారీ చేసింది. ఈ ఆదేశాలే వైరస్ జన్యుక్రమం, పొంచి ఉన్న ప్రమాదం గురించి ప్రపంచానికి తెలియకుండా షీ ఝెంగ్లీని అడ్డుకున్నాయి.
ఇదీ చూడండి: చైనాపై అమెరికాలో వ్యాజ్యాలు.. వృథాప్రయాసేనా?