Britain Covid Rules: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్ సర్కారు కరోనా నిబంధనలను సడలిస్తోంది. తాజాగా మరో కీలక కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం నుంచి కరోనా బాధితులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 'కొవిడ్‌తో సహాజీవనం' ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను పార్లమెంట్‌లో సోమవారం వెల్లడించనున్నారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేసిన అన్ని చట్టపరమైన ఆంక్షలు ముగింపు దశకు వచ్చినట్లు జాన్సన్ పేర్కొన్నారు. తద్వారా బ్రిటన్ ప్రజలు 'తమ స్వేచ్ఛకు భంగం కలకుండా తమను తాము రక్షించుకోగలుగుతారు' అని బోరిస్ వ్యాఖ్యానించారు.
అయితే, ఇది ప్రమాదకరమైన చర్య అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ మరింత ప్రబలి.. కేసులు పెరగడానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. భవిష్యత్‌లో మరింత ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి దేశ రక్షణను బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు జాన్సన్ నిర్ణయంపై ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పించింది. యుద్ధం ముగియక ముందే విజయాన్ని ప్రకటించుకున్నారని ఎద్దేవా చేసింది.
బ్రిటన్ ఇప్పటికే అర్హులై, 12 ఏళ్లు దాటినవారిలో.. 85 శాతం మందికి రెండు డోసుల టీకాలు పంపిణీ చేశారు. జనవరి నెలలోనే చాలా కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం.
ఇదీ చూడండి: Ukraine Crisis: మభ్యపెట్టి దెబ్బతీయడానికి రష్యా సిద్ధం?