బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనుంది. ఆ గడువు మే 22 వరకు పొడిగించడానికి ఈయూ అంగీకరించింది. అయితే దానికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలపాలని షరతు విధించింది. తాజాగా థెరిసా మే ప్రతిపాదన మూడోసారీ వీగిపోయింది. ఫలితంగా ఏప్రిల్ 12లోపు మరో కొత్త ప్రణాళికతో సమస్యను అధిగమించాల్సి ఉంటుంది. ఇందుకు 14 రోజులు మాత్రమే సమయం ఉంది.
ప్రధాని పదవి నుంచి వైదొలగాలి..
"థెరిసా మే బ్రెగ్జిట్ ప్రతిపాదనను పార్లమెంటు తిరస్కరించింది. మరో సరికొత్త ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బియాన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు థెరిసా మే అంగీకరించకపోతే ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓడినా ఆదరణ పెరిగింది..
థెరిసా మే ప్రతిపాదన మూడోసారి వీగిపోయినప్పటికీ గతంతో పోల్చితే ఓట్ల శాతంలో తేడా కనిపించింది. ఇప్పుడు కేవలం 58 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ తిరస్కరణకు గురైంది. ఇంతకుముందు ఈ తేడా 149 ఓట్లుగా ఉండటం గమనార్హం. జనవరిలో ఈ తేడా 230 ఓట్లుగా ఉంది.
సొంత గూటి నుంచే ఎసరు..
సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచే థెరిసా మే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలగాలని 28 సభ్యుల కూటమి ఒత్తిడి తెస్తోంది.
బ్రెగ్జిట్ ప్రతిపాదనలను మరోసారి బ్రిటన్ పార్లమెంటు తిరస్కరించడంపై యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ స్పందించారు. ఏప్రిల్ 10న ఈ విషయంపై మండలిని సమావేశపరుస్తామన్నారు.
- ఇదీ చూడండి:పార్లమెంటుదే అధికారం.. మరి ప్రభుత్వం..?