బ్రిటన్ సముద్ర తీరంలో అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. చిన్న పడవల్లో అక్రమంగా ప్రవేశించేవారిని అడ్డుకుని.. తనిఖీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వలసవచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరిద్దామని ఎదురుచూస్తున్న పోలీసులు చిన్న బోటులో నవజాత శిశువును చూసి చలించిపోయారు.
జరిగింది ఇదీ..
ఫ్రాన్స్‌నుంచి బ్రిటన్‌లోని కెంట్ డంగేనెస్ తీరానికి డింగీ(నాటుపడవ)లో ఓ వలసదారుల బృందం బయలుదేరింది. అయితే వారి ప్రయాణం మొదలైన కాసేపటికే నెలలు నిండిన గర్భిణీ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్న పడవలో వెనక్కి వెళ్లలేక ప్రయాణాన్ని కొనసాగించారు. అలా సముద్రం మధ్యలో దాదాపు తొమ్మిది గంటలపాటు ఆ నవజాత శిశువు ప్రయాణం కొనసాగింది. దీనిపై సమాచారం అందుకున్న రాయల్ నేషనల్ లైఫ్‌బోట్ ఇనిస్టిట్యూషన్ పోలీసులు.. ఒడ్డుకు చేరగానే చిన్నారిని రక్షించారు.
ప్రమాదకర ప్రయాణం..
సాధారణంగా ఉత్తర ఫ్రాన్స్ నుంచి బ్రిటన్‌కు పెద్దఎత్తున వలసలు కొనసాగుతుంటాయి. కరోనా విజృంభణ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వలసదారులు మరింత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. దీనితో వారి అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు డింగీలు వంటి చిన్న పడవలను ఏర్పాటు చేస్తున్నారు. వలసలను నివారించేందుకు బ్రిటీష్-ఫ్రెంచ్ ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడట్లేదు.
బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్ ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకూ 14వేల మందికి పైగా ప్రజలు వలస వచ్చారు. 2020లో దాదాపు 8,500 మంది వలస వెళ్లారు. ఈ ప్రయత్నంలో చాలామంది మరణించారు.
ఇవీ చదవండి: