కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేయాలన్న ఓ పెద్దాయన ఆలోచనకు అనూహ్య స్పందన వచ్చింది. విరాళాల రూపంలో ఏకంగా 15 లక్షల పౌండ్లు సొమ్ము పోగైంది. ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగి... సాయం స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన వైబ్‌సైట్ కూడా క్రాష్ అయింది.
1000 పౌండ్లు లక్ష్యం... కానీ...
ఈ విరాళాలు సేకరించిన పెద్దాయన పేరు టామ్ మూరే. వయసు 99 ఏళ్లు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ సైన్యంలో పనిచేశారు టామ్. బ్రిటన్ తరఫున అప్పట్లో భారత్‌లోనూ కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే క్యాన్సర్ చికిత్స చేయించుకున్నారు.
కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి 1000 పౌండ్లు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు టామ్. ఇందుకోసం విరాళాలు ఇవ్వాలని దాతలను విజ్ఞప్తి చేశారు. అయితే దాతలెవరూ ఊరికే ఇవ్వక్కర్లేదని చెప్పారు. 25 మీటర్లు పొడవున్న తన ఇంటి పెరటిలో 100 సార్లు ఫ్రేమ్ సాయంతో నడుస్తానని, దానిని చూసి విరాళం ఇవ్వాలని కోరారు. ఈ నెలాఖరున తన 100వ పుట్టిన రోజు నాటికి ఈ టాస్క్ పూర్తి చేస్తానని చెప్పారు టామ్.
నడవడమే కష్టమైన వయసులో.. దక్షిణ ఇంగ్లాండ్ బెడ్‌ఫోర్డ్‌షైర్‌లోని తన పెరటిలో 70 రౌండ్లు పూర్తి చేశారు మూరే. ఈలోగా ఆయన వీడియోకు అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 70 వేల మంది దాతలు స్పందించగా.. 1.5 మిలియన్ పౌండ్లు పోగయ్యాయి. దాతల విపరీతమైన స్పందన కారణంగా ఆయన ఏర్పాటు చేసిన 'జస్ట్ గివింగ్' పేజ్ తాత్కాలికంగా క్రాష్ అయింది.
ఇదీ చదవండి: గబ్బిలం కాదు.. వీధి కుక్క నుంచే కరోనా వ్యాప్తి!