కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సరైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి. వైరస్ గొలుసును అడ్డుకోడానికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించడంతో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ రానున్న సంక్షోభంపై ప్రమాద ఘంటికలు మోగించాయి. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రజలను లాక్‌డౌన్‌లో ఉంచడంతో అంతర్జాతీయ వాణిజ్యం, ఆహార సరఫరా గొలుసులో ఒడుదొడుకులు ఏర్పడ్డాయి. ఆహార పదార్థాల సరఫరాపై ఉన్న ఆందోళనల వల్ల ఇప్పటికే అన్ని సూపర్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
‘ఆహార పదార్థాల కొరతను అధిగమించడానికి, ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతాల మధ్య వాణిజ్యం సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని మూడు సంస్థలు కలిసి చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. ‘వ్యవసాయ, ఆహార పరిశ్రమకు చెందిన కార్మికుల రాకపోకలను కట్టడి చేయడం, ఆహార కంటైనర్ల రాకపోకలకు సరిహద్దుల వద్ద ఆలస్యం కావడంతో కొన్ని ఉత్పత్తులు పాడయ్యే అవకాశం ఉండటం ఈ సంక్షోభానికి కొన్ని కారణాలు’ అని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమయంలో అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని వెల్లడించాయి.