రోజూ బిజీబిజీగా గడిపే ప్రపంచాన్ని గడప దాటకుండా చేసింది కరోనా. దేశవిదేశాల్లో ప్రజలందరూ ఏమీ తోచక ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం నలుగురు స్నేహితులు ఒక చోట కలిసే అవకాశం కూడా లేదు. పెళ్లిళ్లు, వేడుకలు, కార్యక్రమాలు ఇలా అన్నీ రద్దయ్యాయి. అయితే కరోనా కూడా ఒక జంట పెళ్లిని ఆపలేకపోయింది. కరోనా కాలంలో పెళ్లేంటి అనుకుంటున్నారా? అయితే ఈ వింత పెళ్లి గురించి చదివేయండి.
ఇంగ్లాండ్కు చెందిన ఆడమ్ వుడ్స్, లారా ఆక్టన్ జంట పెళ్లి చేసుకోవడానికి ఓ ఖరీదైన కల్యాణ వేదికను ముందుగానే బుక్ చేసుకుంది. అయితే అనుకోకుండా కరోనా మహమ్మారి రావడం వల్ల లాక్డౌన్లో భాగంగా ఆ కల్యాణ మండపాన్ని మూసివేశారు.
అయితే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఈ జంట కల్యాణ మండపానికి వెళ్లే దారిలో ఓ హోటల్లో ఆగింది. ఉల్లిపాయలతో తయారు చేసిన రింగులను మార్చుకుని ఒక్కటైంది.
" ఉంగరాల మాదిరిగా ఉండే ఉల్లిపాయలతో చేసిన పదార్థాలను ఆడమ్ ఆర్డర్ చేశాడు. వాటిని తీసుకొని మేము ఉన్న కారు దగ్గరకు వచ్చి వాటినే ఉంగరాలుగా భావించి మార్చుకుందాం అన్నాడు. అలా మేమిద్దరం ఒకటయ్యాం"
-- లారా, వధువు
బ్రిటన్లో ఇప్పటికే 25 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. 1700 మందికి పైగా మృతి చెందారు. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్కు కూడా కొవిడ్-19 సోకింది.
ఇదీ చదవండి: గ్రీన్ కార్డుకోసం మనోళ్లు దశాబ్దాలు వేచి చూడాల్సిందే!