మరికొద్ది క్షణాల్లో కొడుకును పెళ్లి చేసుకుని తన ఇంట్లో కాలుపెట్టాల్సిన కోడలు.. తన కడుపున పుట్టిన బిడ్డే అని తెలిస్తే..ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? చైనాలో ఓ తల్లికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఏళ్ల కిందట తప్పిపోయిన తన కుమార్తెనే ఇప్పుడు తన కొడుకు పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ తల్లికి తెలిసింది. అలాంటి సమయంలో ఆ తల్లి ఏం చేసింది..? లేదనుకున్న బిడ్డ దొరికినందుకు సంతోషించాలా.. కొడుకు పెళ్లి ఆగిపోతున్నందుకు బాధపడాలా? సినిమా కథను తలపించే ఈ ఘటన చైనాలోని జియాంగ్జు రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..
సుజౌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మార్చి 31న తన కుమారుడి వివాహం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. పెళ్లి రోజు రానే వచ్చింది.. అతిథులంతా వచ్చేశారు. ఇంతలో కాబోయే కోడలి దగ్గరకు వెళ్లిన ఆ మహిళ.. అమ్మాయి చేతిపై ఉన్న పుట్టుమచ్చను చూసి ఆశ్చర్యపోయింది. 20ఏళ్ల క్రితం దూరమైన ఆమె కుమార్తె చేతిపై కూడా అచ్చం అలాగే పుట్టుమచ్చ ఉండేదని జ్ఞప్తికి వచ్చింది. ఆ పాపే.. ఈ అమ్మాయి కాదు కదా అని సందేహించింది. ఎందుకైనా మంచిదని వధువు తల్లిదండ్రులను అడిగింది.
ఆమె ప్రశ్న విన్న అమ్మాయి తల్లిదండ్రులు తొలుత కంగారుపడినా తర్వాత విషయం బయటపెట్టారు. 20ఏళ్ల క్రితం రోడ్డు పక్కన తమకు చిన్న పాప దొరికిందని, ఆమెను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు తెలిపారు. తప్పిపోయిన కన్నబిడ్డ దొరికినందుకు అబ్బాయి తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అటు వధువు పరిస్థితి అంతే.. ఆమె తన సొంత తల్లి అని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంది.
అయితే అక్కడే అసలు సమస్య ఎదురైంది. కాబోయే అత్తగారు తన సొంత తల్లి అయితే.. పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి తనకు సోదరుడు అవుతాడు. మరి వివాహం చేసుకోవడం ఎలా అని వధువు తటపటాయించింది. కానీ అదృష్టవశాత్తూ ఆ మహిళ పెంచుకున్న వరుడు కూడా దత్తపుత్రుడే. కుమార్తె దూరమైన తర్వాత ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికిన ఆ తల్లి.. ఆ తర్వాత ఓ బాలుడుని దత్తత తీసుకుని పెంచుకున్నారట. దీంతో ఆ వధూవరుల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది..!
ఇదీ చూడండి: క్షుద్రపూజల పేరిట యువతిపై అత్యాచారం