కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సార్క్ దేశాల అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సంకల్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలో తాము కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలనుకుంటున్నట్లు ప్రకటించింది దాయాది పాకిస్థాన్. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆయేషా ఫారూఖీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆరోగ్య రంగంలో ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న జాఫర్ మీర్జా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
"కొవిడ్-19 ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆరోగ్య శాఖలో ప్రధానమంత్రి ప్రత్యేక అధికారి అందుబాటులో ఉంటారు."
-పాక్ విదేశాంగ శాఖ ట్వీట్
ప్రపంచవ్యాప్తంగా 5వేలమందికిపైగా ప్రాణాలు పోయేందుకు కారణమైన కరోనాను ఎదుర్కొనేందుకు సార్క్ దేశాల భాగస్వామ్యంలో ఓ సంయుక్త కార్యాచరణను చేపట్టాలని మోదీ పిలుపునిచ్చిన అనంతరం పాక్ ఈ ప్రకటన చేయడం విశేషం. నేపాల్, భూటాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ దేశాధినేతలు కూడా సానుకూలంగా స్పందించారు.
అయితే పుల్వామా దాడి అనంతరం సార్క్ కూటమిలో పాక్ భాగమైతే తాము పాల్గొనబోమని హెచ్చరిస్తూ వస్తోంది భారత్. ఈ నేపథ్యంలో పాక్ ప్రకటనపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ఇదీ చూడండి: 'మోదీజీ.. మాస్క్‌ల ఎగుమతులకు అనుమతినివ్వండి'