కరోనా వైరస్ మహమ్మారి ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్‌లు తుదిదశ ప్రయోగాల్లో ఉన్నాయి. వీటిలో చైనా కంపెనీలు అభివృద్ధి చేసిన నాలుగు వ్యాక్సిన్‌లు తుదిదశ మానవ ప్రయోగాల్లో ఉన్నాయి. తాజాగా వీటిలో మూడు టీకాలు నవంబర్ నాటికి ప్రజా వినియోగానికి అందుబాటులోకి రావచ్చని చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) వెల్లడించింది. 'మూడోదశలో ఉన్న ఈ టీకా ప్రయోగాలు సాఫీగా సాగుతున్నాయి. ఇవి నవంబరు లేదా డిసెంబరు నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది' అని చైనా సీడీసీ బయోసేఫ్టీ నిపుణులు గైఝెన్ వూ అక్కడి అధికారిక మీడియాలో పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో తాను కూడా వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు వెల్లడించిన గైఝెన్ వూ, ఇప్పటివరకు ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే, నాలుగు వ్యాక్సిన్‌లలో ఏ వ్యాక్సిన్‌ను తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె తెలియజేయలేదు.
చైనా జాతీయ ఫార్మా గ్రూప్(సినోఫార్మ్), సినోవాక్ బయోటెక్‌తో కలిసి మూడు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశాయి. ఇప్పటికే వీటి ప్రయోగాలు చైనాతోపాటు యూఏఈలోనూ కొనసాగుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సినోఫార్మ్ జులై నెలలోనే ప్రకటించింది. ఇక చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్ తయారుచేసిన మరో వ్యాక్సిన్ కూడా తుది దశ ప్రయోగాల్లో ఉండగా..ఇప్పటికే చైనా సైన్యం దీన్ని వినియోగించేందుకు జూన్‌లోనే అనుమతులు వచ్చాయి.
ఆసక్తి రేపుతున్న చైనా..
కరోనా వ్యాక్సిన్ కోసం పలు దేశాలతోపాటు ఫార్మా కంపెనీలు కూడా పోటీపడుతున్నాయి. ఈ సమయంలో వ్యాక్సిన్ కోసం కంపెనీలపై కొన్ని దేశాలు ఒత్తిడి తెస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్‌కు చెందిన తొమ్మిది వ్యాక్సిన్ అభివృద్ధి కంపెనీలు మాత్రం, శాస్త్రీయంగా క్లినికల్ ట్రయల్స్ పూర్తైన తర్వాతే వ్యాక్సిన్‌ను ప్రజా వినియోగానికి విడుదల చేయాలని ఈ మధ్యే ప్రతిజ్ఞ చేశాయి. ఈ సమయంలో చైనా వ్యాక్సిన్ నవంబర్, డిసెంబర్ నాటికే అందుబాటులోకి వస్తుందని చైనా సీడీసీ ప్రకటించడం ఆసక్తిగా మారింది.
యూఏఈలో వాడకానికి అనుమతి..
చైనా సినోఫార్మ్ తయారుచేసిన వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు యూఏఈలో జరుగుతున్నాయి. గత ఆరు వారాలుగా అక్కడి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే, కరోనా పోరులో ముందువరుసలో ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూఏఈ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ట్విటర్‌లో వెల్లడించింది. తొలి రెండుదశల ప్రయోగ ఫలితాలు సురక్షితంగా ఉండడంతో పాటు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలడం వల్లే వీటికి అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటికే సినోఫార్మ్ అభివృద్ధిచేసిన వ్యాక్సిన్ ప్రయోగాల్లో దాదాపు 31వేల మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: సరిహద్దు వెంబడి చైనా మరో కుట్ర