అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లపై అమెరికా బలగాలు రెండు సార్లు వైమానిక దాడులు జరిపాయి. పశ్చిమ ఫరా రాష్ట్రంలో అఫ్గాన్ దళాలపై దాడి చేస్తున్న 25 మంది ముష్కరులను లక్ష్యంగా చేసుకొని శుక్రవారం మధ్యాహ్నం వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సైనిక అధికార ప్రతినిధి కల్నల్ సోని లెగెట్ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు సీనియర్ తాలిబన్ కమాండర్లు, 13 మంది సభ్యులను మట్టుపెట్టినట్లు అఫ్గాన్ ప్రభుత్వాధికారి ఒకరు స్పష్టం చేశారు.
గత నెలలో ముస్లింల పర్వదినం సందర్భంగా తిరుగుబాటుదారులు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం.. తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా దాడులు చేయడం ఇదే మొదటిసారి.
పోలీసులపై కాల్పులు...
మరోవైపు దక్షిణ జాబుల్ రాష్ట్రంలో ముష్కరులు రోడ్డు పక్కన బాంబు పేల్చి.. అఫ్గాన్ పోలీసు కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు చనిపోయారు. జరిగిన కాల్పుల్లో నలుగురు తాలిబన్ సభ్యులు కూడా మరణించినట్లు అప్గాన్ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి తారిక్ అరియన్ తెలిపారు. అయితే ఈ దాడికి తాలిబన్లు ఇప్పటికీ ఎటువంటి బాధ్యత వహించలేదు.