ప్రాణాంతక కరోనా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 40లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. సుమారు 3లక్షల మంది మరణించారు. వైరస్ దెబ్బకు ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. లాక్డౌన్ ఆంక్షలు ప్రజలు-ప్రభుత్వాల మధ్య వివాదాలకు దారి తీస్తున్నాయి. కొన్ని దేశాలైతే.. వైరస్ ధాటికి ఇప్పట్లో తేరుకునేట్లు కనిపించడం లేదు. మరికొన్నిదేశాలు.. వైరస్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో పరిస్థితులపై సమగ్ర కథనం...
తుపాను భయంలో ఫిలిప్పీన్స్..
ఫిలిప్పీన్స్ ఓ వైపు కరోనాతో సతమవుతుంటే మరో వైపు తుపాను వణికించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల వేలాది మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి బలవంతంగా తరలిస్తున్నారు అక్కడి అధికారులు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. వారందరూ భయాందోళనకు గురవుతున్నారు.
ఆంక్షలు సడలింపు
కొన్ని దేశాల్లో వైరస్ నియంత్రణలోకి రావడం వల్ల ఆంక్షలను సడలిస్తున్నారు. వీటిలో న్యూజిలాండ్ ఒకటి. నిరుద్యోగ రేటును అదుపులో ఉంచడానికి అప్పు చేసి మరీ ఖర్చు చేయాలని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మాల్స్, రిటైల్ స్టోర్లు తెరుచుకున్నాయి. అయితే వైరస్ మళ్లీ విస్తరించే ప్రమాదం ఉండటం వల్ల కొన్ని పరిమితులు విధించింది.
త్వరలోనే..
జపాన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని షింజో అబే. అయితే వ్యాధి తిరిగి పుంజుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇటలీలో ఇలా..!
వైరస్ ప్రభావంతో భారీగా నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. వ్యాపారులకు, కుటుంబాలకు సహాయం చేయడానికి భారీగా పన్ను కోతలు, ఇతర ఆర్థిక సాయం కోసం ప్యాకేజీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు ఆ దేశ ప్రధాని గిసెప్పె కాంటే.
వివాదాలతో ఇథోఫియా
ప్రపంచ దేశాల్లో విధించిన నిబంధనలు ప్రజలు, అధికారుల మధ్య వివాదాలకు దారి తీస్తున్నాయి. ఆంక్షలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకుండా తిరిగిన వెయ్యి మందిని అరెస్ట్ చేసినట్లు ఇథోఫియా పోలీసు అధికారి తెలిపారు. గ్రీస్‌లోని పాఠశాల గదుల్లో కెమెరాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రణాళికపై అక్కడి ప్రజలు, విపక్షలు విరుచుకుపడ్డాయి.
వినూత్నంగా
రియో డీ జనీరోలో.. ఓ అపార్ట్‌లోని నివాసితులు తమ పిల్లలకు వినోదాన్ని అందించడానికి వారి భవనానికి వెలుపల సినిమా థియేటర్ మాదిరిగా ఓ స్కీన్ ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మిక దారిలో..
ఆధ్యాత్మిక మద్దతు, మానవ సంబంధాలను కోరుకునే వారికి వాటికన్ నుంచి గ్రామ చర్చిల వరకు ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నారు మత గరువులు.
మాంద్యం తర్వాత అత్యధికంగా..
మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్ధం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హెచ్చరించినందున తాను ఉద్యోగాన్ని కోల్పోయానని అగ్రరాజ్య రోగనిరోధక శాస్త్రవేత్త ఒకరు ఆరోపించారు. అమెరికా "ఆధునిక చరిత్రలో చీకటి రోజులు" ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. దేశంలో నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో 14.7 శాతానికి పెరిగింది. మహా మాంద్యం తర్వాత ఇదే అత్యధికం.
ఇదీ చూడండి: అమెరికాలో కార్చిచ్చు.. 400 ఎకరాలు దగ్ధం