ఆస్ట్రేలియా కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం మంటలు చెలరేగాయి. అగ్ని కీలలను అదుపు చేసేందుకు హెలికాఫ్టర్లు, విమానాలను వినియోగిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో మంటలు ఆర్పేందుకు వినియోగించిన ఓ భారీ విమానం (ఎయిర్ ట్యాంకర్) సిడ్నీకి సమీపంలోని పర్వతాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది న్యూసౌత్ వేల్స్ గ్రామీణ అగ్నిమాపక సంస్థ.
"స్నోవి మొనరో ప్రాంతంలో మంటలు అదుపు చేసేందుకు వినియోగించిన అతిపెద్ద ఎయిర్ ట్యాంకర్‌తో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో సమాచారం తెగిపోయింది. అమెరికాకు చెందిన ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. వారి జీవితాలను కార్చిచ్చు అదుపు చేసేందుకు త్యాగం చేశారు."
-షేన్ ఫిట్జ్‌సిమ్మన్స్, అగ్నిమాపక శాఖ అధికారి
విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం భారీగా వీస్తోన్న గాలుల కారణంగా భారీ ట్యాంకర్లు గాల్లో ఎగరటం చాలా ఇబ్బందులతో కూడుకున్న విషయమని చెప్పారు షేన్.
మిగతా విమాన సేవల నిలిపివేత..
భారీ ఎయిర్ ట్యాంకర్ కూలిన క్రమంలో నివారణ చర్యలు చేపట్టింది కెనడాకు చెందిన విమానయాన సంస్థ. న్యూ సౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో కార్చిచ్చు అదుపుచేసేందుకు వినియోగించే మిగతా భారీ విమానాల సేవలను నిలిపివేసింది.
32కు చేరిన మృతుల సంఖ్య..
విమాన ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురితో కలిపి ఇప్పటి వరకు కార్చిచ్చులో మృతి చెందిన వారి సంఖ్య 32కు చేరింది.
ఇదీ చూడండి: కంచెను ఢీకొని కూలిన విమానం.. నలుగురు మృతి