Terror Attack on Pak Army Post: పాకిస్థాన్ సైనిక స్థావరాలలోకి ఉగ్రమూకల చొరబాటును సైన్యం ప్రతిఘటించింది. ఈ ఎదురుదాడిలో 15 మంది ఉగ్రవాదులు, నలుగురు సైనికులు మరణించారు. నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై స్పందించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సైనికుల ప్రాణ త్యాగాలను కొనియాడారు. సైన్యానికి దేశం అండగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
'బలూచిస్థాన్‌లో పంజగుర్, నౌష్కి సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఉగ్రదాడులను పాక్ సైన్యం ప్రతిఘటించింది. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. మరో తొమ్మిది మంది కాసేపటి తర్వాత మరణించారు. నలుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు' అని పాక్ అంతర్గ వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు.
దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు నిషేధిత బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. సైనిక స్థావరాలలోకి చొరబాటుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.
బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థ బీఎల్ఏ ఆ ప్రాంతంలో నిరంతరం దాడులకు పాల్పడుతోంది.
ఇదీ చదవండి: సిరియాలో అమెరికా మెరుపు దాడి- 13 మంది పౌరులు బలి