శ్రీలంకలో మరోమారు ఉగ్రకలకలం రేగింది. రాజధాని కొలంబోకు 360 కిలోమీటర్ల దూరంలోని కల్మునై నగరంలో శుక్రవారం రాత్రి భద్రతా దళాలకు, ముష్కరులకు జరిగిన పోరులో 15 మంది మరణించారు. ఇందులో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు.
ఆదివారం మారణహోమానికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం శ్రీలంక పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కల్మునై నగరం సైందమారుడు ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో ఓ ఇంట్లో సోదాలు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. భద్రతా సిబ్బందికి పట్టుబడకుండా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో మొత్తం 15 మంది మరణించారు. వీరిలో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో నలుగురు ఆత్మాహుతి దళ సభ్యులని పోలీసులు చెప్పారు. గాయపడ్డ మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నగరంలో విధించిన కర్ఫ్యూ నిరవధికంగా కొనసాగుతుందని ప్రకటించారు.
ఆదివారం చర్చిలు, హోటళ్లలో జరిగిన ఉగ్రదాడుల్లో 253 మంది మరణించారు.
ఇదీ చూడండి: 'వైఫల్యాల' లంకలో మరో అధికారి రాజీనామా