Saravana Bhavan Style Tomato Chutney Recipe : టిఫెన్ తినడానికైనా, భోజనం చేయడానికైనా.. కొన్ని పచ్చళ్లు అద్దిరిపోయేలా ఉంటాయి. అలాంటి వాటిల్లో ముందు వరుసలో ఉంటుంది టమాటా పచ్చడి. అయితే, ఈ చట్నీని మీరు ఇప్పటి వరకు రకరకాలుగా ట్రై చేసి ఉంటారు. కానీ, ఓసారి "తమిళనాడు స్పెషల్ శరవణ భవన్ టమాటా చట్నీ"ని ట్రై చేయండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశలు ఇలా దేనిలోకైనా సూపర్‌గా ఉంటుంది. పైగా దీన్ని ఎవరైనా నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ప్రిపరేషన్ పద్ధతి ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- టమాటాలు - 3
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఎండుమిర్చి - 10 నుంచి 12
- ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్ది)
- పసుపు - చిటికెడు
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :
- ఆయిల్ - 1 టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 1 రెమ్మ
- ఇంగువ - చిటికెడు
టమాటాలు ఉడకబెట్టకుండా నిమిషాల్లో అద్దిరిపోయే పచ్చడి - అన్నం, టిఫెన్స్లోకి సూపర్ కాంబో!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా టమాటాలు, ఉల్లిపాయను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని లో ఫ్లేమ్ మీద కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
- అవి వేగాక ఎండుమిర్చిని వేసుకొని వాటిని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
- అనంతరం అందులో పసుపు, టమాటా ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై ఉప్పు కూడా వేసుకొని కలిపి లో ఫ్లేమ్ మీద టమాటా, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి.
- అందుకోసం నాలుగైదు నిమిషాల సమయం పట్టొచ్చు. ఆవిధంగా వేయించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన టమాటా మిశ్రమం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు చట్నీకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టౌపై టమటా మిశ్రమం వేయించుకున్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు ఎండుమిర్చిని తుంపి వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగిందనుకున్నాక అందులో ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న చట్నీ వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకొని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే శరవణ భవన్ స్టైల్ "టమాటా పచ్చడి" రెడీ!
పొయ్యి, నూనెతో అవసరమే లేదు - నోరూరించే మిర్చి, చింతపండు రోటి పచ్చడి నిమిషాల్లో!