Packing Food Items Without Any Details In Telangana : పెద్దపల్లిలో వినియోగదారుడు ఇటీవల ఓ దుకాణంలో తినుబండారాలు కొనుగోలు చేశారు. దానిపై ఎమ్మార్పీ, ఇతర వివరాలు ఏవీ లేవు. దీనిపై ఆయన దుకాణ యజమానిని నిలదీస్తే 'ఇష్టముంటే కొను, లేకుంటే లేదు' అని సమాధానమిచ్చారు.
- కరీంనగర్‌లో ఓ ఉద్యోగి పాల ప్యాకెట్ కొన్నాడు. దానిపై ఎలాంటి వివరాలు ముద్రించి లేవు.
- జగిత్యాలలో ఓ వ్యక్తి బుక్ స్టాల్‌లో నానోటేప్ కొన్నాడు. ప్యాకింగ్‌పై ఎలాంటి వివరాలు లేవు. కనీసం ఎమ్మార్పీ కూడా ముద్రించి లేదు. దుకాణ యజమాని ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వచ్చింది.
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని పలు సంస్థలు, వ్యక్తులు రకరకాల తినుబండారాలు, వస్తువులను విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా మోసాలకు తెర తీస్తున్నారు. తూకం, కొలతల్లో తేడాలు, గడువు, తయారీ ప్రాంతం, చిరునామా తదితర వివరాలు లేకుండానే ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. ఎలాంటి ముద్రణ లేకుండా ఉంటున్న వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ప్యాకెట్లపై ఏయే వివరాలు ఉండాలి? మార్కెట్లో ఏం జరుగుతోంది? వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వివరాలతో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం
కుళ్లిన మాంసం కొవ్వుతో వంట నూనె - ఎసిటిక్ యాసిడ్‌తో పాలు - సిట్రిక్ యాసిడ్‌తో అల్లం పేస్ట్!
- చాలా చోట్ల ప్యాకెట్లపై వస్తువు వివరాలు ముద్రించడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తినుబండారాలు తయారు చేస్తూ వాటిని ప్యాకింగ్ చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. నాణ్యత లేనివి తయారు చేయడంతో పాటు వాటిపై తినే పదార్థం వివరాలు ఉండడం లేదు.
- గడువు తేదీ లేకపోవడంతో అందులో వస్తువులు మంచివేనా లేదా అన్న విషయం అర్థం కాదు. అవి చెడిపోయి ఉండి, వాటిని తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది.
- ముఖ్యంగా అందరూ పరిగణించాల్సిన విషయం.. ఎలాంటి ప్రాంతంలో పదార్థాన్ని తయారు చేస్తున్నారు. ఏయే వస్తువులు అందులో కలిపారు. దాని ధర ఎంత, ఎప్పుడు తయారు చేశారు అనే వివరాలు తెలియడం లేదు.
- విక్రయాలపై తప్పనిసరిగా తూనికలు, కొలతల శాఖ నుంచి పర్మిషన్లు తీసుకుని ఉండాలి. ప్యాకింగ్‌పై ముద్రించే లోగో, ఇతర వివరాలను సంబంధింత శాఖలు అప్పజెప్పాలి. కానీ ఇవేవీ జరగడం లేదు.
ఆ వివరాలు తప్పకుండా ముద్రించాలి : ఏ ఆహార పదార్థాలు అయినా ప్యాకింగ్ చేసి విక్రయిస్తే తప్పకుండా దాని పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఆ ప్యాకెట్‌పై ముద్రించాలి. సంస్థ పేరు, చిరునామా, వస్తువు పరిమాణం, అమ్మకం ధర, తయారీ తేదీ, అందులో కలిపిన వివరాలు, పిన్‌కోడ్, గడువు తేదీ, చరవాణి నంబర్, కస్టమర్ కేర్ వివరాలను తప్పనిసరిగా ప్యాకెట్‌పై ఉంచాలి. ఆ వివరాలు ప్యాక్‌పై ఉన్నాయా? లేదా చూసి వస్తువు కొనాలి. వివరాలు లేకపోతే కొనకపోవడం శ్రేయస్కరం.
- పదార్థాలు గడువులోగా చెడిపోతే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి అడగడానికి వీలుంటుంది.
- ప్యాక్‌లో ఏది ఎంత మోతాదులో ఉన్నాయో ఆ వివరాలు ముద్రించారా అన్నది పరిశీలించాలి. లేని పక్షంలో తూనికల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
- ప్యాకింగ్‌పై చెరిపివేతలు, పాత వివరాలపై స్టిక్కర్లు అతికించడం లాంటివి చేశారేమో గమనించాలి.
- గ్రాము నుంచి కిలో వరకు ఎంత ధర పలుకుతుందో అన్న వివరాలు కూడా దానిపై ముద్రించి ఉండాలి.
కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు : ప్యాకింగ్ చేసి విక్రయించే వారు నిబంధనలు పాటించాలని తూనికలు, కొలతల శాఖ సహాయ నియంత్రణాధికారి విజయసారథి అన్నారు. కొనుగోలుదారులకు అర్థమయ్యేలా వివరాలు ముద్రించాలని, ధర, గడువు తేదీ ఇలా ప్రతి అంశం తెలియజేయాలని తెలిపారు. అలా చేయకున్నా, ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయించినా వినియోగదారులు సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పదార్థాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని, ఏమైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే నేరుగా కార్యాలయంలో చేయొచ్చని వివరించారు. clm-ts@nic.inలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అనారోగ్యాల బారిన పడేస్తున్న కల్తీ పా"పాలు" - ప్రజారోగ్యంపై తీవ్ర అనర్థాలు!
తక్కువ ధరకే వస్తున్నాయని ఎక్కడపడితే అక్కడ ఆహార పదార్థాలు కొంటున్నారా? - మీరు రిస్క్‌లో పడినట్లే!