Egg Karam Dosa in Telugu: మనలో చాలా మందికి టిఫిన్స్ అన్నింట్లోనూ దోశ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మసాలా, ఆనియన్ ఇలా అనేక రకాల దోశలు ఉన్నా.. ఎగ్ దోశ అంటే మరింత ఇష్టంగా తింటుంటారు. అయితే, ఈ ఎగ్ దోశను సాధారణంగా కాకుండా.. కాస్త వెరైటీగా స్పైసీ గార్లిక్ చట్నీతో చేస్తే అద్దిరిపోతుంది. ఇంకా దీన్ని ఎవరైనా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ దోశకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు మినపపప్పు
- రెండున్నర కప్పులు బియ్యం
- అరకప్పు అటుకులు
- ఒక టీ స్పూన్ మెంతులు
- 3 టీ స్పూన్లు నూనె
- అర టీ స్పూన్ ఆవాలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- ఒక గుడ్డు
- ఒక టీ స్పూన్ నెయ్యి
- ఒక చిటికెడు ఉప్పు
- ఒక చిటికెడు మిరియాల పొడి
- కొద్దిగా ఉల్లిపాయ తరుగు
- కొద్దిగా కొత్తిమీర
స్పైసీ గార్లిక్ చట్నీ కోసం పదార్థాలు
- 20 ఎండుమిరపకాయలు
- 12 వెల్లుల్లి రెబ్బలు
- 15 చిన్న ఉల్లిపాయలు
- ఒక టీ స్పూన్ కల్లుప్పు
- ఉసిరి కాయంత చింతపండు
తయారు చేసే విధానం
- ముందుగా మినపపప్పు, బియ్యం, అటుకులు, మెంతులు అన్నింటిని ఒకసారి శుభ్రంగా కడిగి, వేర్వేరు గిన్నెల్లో విడివిడిగా సుమారు 4 గంటలపాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత వాటన్నింటిలోని నీటిని వడకట్టుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం ఈ పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి కనీసం 12 గంటలపాటు పులియబెట్టుకోవాలి.
- ఆ తర్వాత పులియబెట్టుకున్న పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి.
- మరోవైపు స్పైసీ గార్లిక్ చట్నీ కోసం మిక్సీ జార్లో గంటపాటు నానబెట్టిన ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, కల్లుప్పు, చింతపండు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఒక పాన్‌లో నూనె తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
- ఆ తర్వాత ఇందులో రుబ్బుకున్న పేస్ట్ వేసి, 2-3 నిమిషాలు వేయిస్తే స్పైసీ గార్లిక్ చట్నీ రెడీ అయిపోతుంది.
- ఇప్పుడు స్టౌ పైన పెనం పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న దోశ పిండిని వేసి అంచుల్లో నెయ్యి వేయాలి.
- ఆ తర్వాత దోశపై ముందుగా రెడీ చేసుకున్న స్పైసీ గార్లిక్ చట్నీని వేసి, ఓ గుడ్డును కొట్టి చుట్టూరా కలపాలి.
- దోశపైన ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, నెయ్యి వేసి దోశను కాల్చాలి.
- దోశ ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు కూడా వేయిస్తే టేస్టీ ఎగ్ దోశ రెడీ!
- ఇంక దీనిని రెండు భాగాలుగా లేదా కావాల్సిన విధంగా కట్ చేసి వేడిగా ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు.
'గుంటూరు చికెన్ మసాలా' ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే ముక్క కూడా మిగల్చరు! వెరైటీగా తినండి!!
ఆదివారం అద్దిరిపోయే మటన్ కుర్మా- ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు! మీరు ట్రై చేయండి!!