గుమ్మం ముందు కట్టెలపొయ్యిపై వంట చేస్తున్న జరీనాను మిలటరీ వాహనాలపై వచ్చిన కొందరు బలవంతంగా లాక్కుపోయారు.. తల్లిని వదల్లేని ఆమె కొడుకు చిన్నారి మురాద్‌బక్స్ కూడా అమ్మవెంట పడ్డాడు.. వాడినీ ఆ ట్రక్కులో వేసుకుని తీసుకెళ్లిపోయారు వాళ్లు. ఇది జరిగి ఎనిమిదేళ్లవుతున్నా ఇంతవరకూ జరీనా ఆచూకీ లేదు. ఇలాంటి స్త్రీల వ్యథలని ప్రపంచానికి వినిపించే గొంతుక కావాలనుకుంది కరీనా బలూచ్.
బలూచిస్థాన్‌లో స్త్రీలు గర్భం దాల్చడమంటే మృత్యువుని ఆహ్వానించడమే! ప్రసవించిన ఆ తల్లికి తన బిడ్డ బతికి ఉంటుందో లేదో తెలియదు. ఆ బిడ్డకు తల్లి దక్కుతుందో లేదో గ్యారంటీ అసలే లేదు. ఆసియాలోనే అత్యధికంగా మాతాశిశు మరణాలు ఉన్న ప్రాంతం బలూచిస్థాన్. ఐరాస నివేదించిన పాపులేషన్ ఫండ్ లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో ప్రతి 20 నిమిషాలకు ఓ స్త్రీ మరణిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 53 శాతం మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. నిజం అంతకంటే ఘోరంగానే ఉంది. అలాగని ఆ ప్రాంతం స్వతహాగా వెనకబడిన ప్రాంతం అనుకుంటే పొరపాటు. సహజవనరులకు పెట్టింది పేరు. బంగారం, బొగ్గు, యురేనియంతోపాటూ సహజవాయు నిల్వలు అధికంగా ఉన్న సంపన్నప్రాంతం.
ఇదీ చదవండి: జనారోగ్యంతోనే 'ఆత్మనిర్భర్'
సహజవాయు నిల్వలు అత్యధికంగా ఉన్నా ఈ ప్రాంతంలో ఇప్పటికీ మహిళలు కట్టెలపొయ్యిమీదే వంట చేస్తుంటారు. అదీ వారి అభివృద్ధి పథం! ఇదేంటని? ప్రశ్నించాలన్న ఆలోచన కనీసం మనసులోకి రాకముందే ఆ ప్రాంతంలో స్త్రీలు హఠాత్తుగా మాయమవుతుంటారు. ఇక వాళ్ల ఆచూకీ ఎప్పటికీ తెలియదు. ఒకవేళ కనిపించినా శవాలుగా మాత్రమే కనిపించేవారు. తీవ్రమైన గాయాలతో అత్యాచారానికి గురైన వాళ్ల శరీరాలు ఏ ఖాళీ భవనాల్లోనో కనిపించేవి. చదువుకోవడానికి పంపించినా తమ ఆడపిల్ల ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందని నమ్మకం లేదు కాబట్టి బలూచిస్థాన్ లో ఏ మహిళాా తన కూతురుని చదువుకోవడానికి బడికి పంపించదు. ఒక వేళ ధైర్యం చేసి పంపించాలనుకున్నా బడులు, కాలేజీలో చదువుతూ కాస్త చురుగ్గా ఉండే అమ్మాయిలపై యాసిడ్ దాడులు చాలా సహజంగా జరుగుతాయక్కడ. ఈ పరిస్థితులని మార్చాలనే పట్టుదలగా చదువుకోవడం మొదలుపెట్టింది కరీమా బలూచ్.
మానవ హక్కుల కార్యకర్తగా..
బలూచిస్థాన్‌లోని టంప్ పట్టణంలో పుట్టింది కరీమా. సైకాలజీలో పట్టాపొందిన బలూచ్ 2006లో స్థానిక సమస్యలపై పోరాడే బీఎస్‌ఓ-ఆజాద్ సంస్థలో సామాన్య కార్యకర్తగా అడుగుపెట్టింది. చురుగ్గా పనిచేస్తూ 2013 నాటికి ఆ సంస్థకు మొదటి మహిళా ఛైర్‌పర్సన్‌గా ఎదిగింది. సరిగ్గా అదే సంవత్సరం పాకిస్థాన్ ఈ సంస్థ కార్యకలాపాలని నిషేధించింది. ఇందులోని సభ్యులని తీవ్రవాదులుగా పరిగణించింది. కానీ కరీమా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మానవ హక్కుల కార్యకర్తగా తనకంటే ముందు ఈ పోరాటాన్ని ముందుకు నడిపించి కనిపించకుండా పోయిన ఇరవై వేలమంది బలూచీల ఆచూకీ కోసం పోరాటం మొదలుపెట్టింది. అదే ఆమెను ప్రపంచం దృష్టిలో పడేట్టు చేసింది. 2016లో బీబీసీ గుర్తించిన తొలి వందమంది ప్రభావిత మహిళల్లో ఒకరిగా నిలిచింది.
పెరిగిన శత్రువులు..
బీబీసీ గుర్తింపుతో పాటూ ఆమెకు శత్రువులూ పెరిగారు. ఆమె ఇంటిని ఎన్నోసార్లు పేల్చేశారు. అందుకే ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు కరీమా ముసుగు వేసుకునేది. ‘ఈ ముసుగు ముఖానికే కానీ.. నాలోని నాయకురాలికీ, ప్రశ్నించే గుణానికి కాదని' ధైర్యంగా ప్రకటించింది. ఆ తర్వాత బలూచిస్థాన్ నుంచి కెనడా వెళ్లి పొలిటికల్ సైన్స్ చదువుతూ తన కార్యకలాపాలు కొనసాగించింది. సోషల్ మీడియా వేదికగా బలూచిస్థాన్‌లో మాయమైన స్త్రీల.. తండ్రులు, సోదరులు, భర్తల గురించి పోరాటం చేసింది. డిసెంబర్ 21న కెనడాలోని టోరంటోలో అనుమానస్పద రీతిలో కన్నుమూసింది.
ఇదీ చదవండి: ఆహార పెట్టెలను కార్లలోకి ఎక్కించిన ఇవాంక