పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, ప్రధాన విపక్ష నేత షహ్‌బాజ్ షరీఫ్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) అరెస్టు చేసింది. అక్రమ నగదు బదిలీ ఆరోపణలతో గత వారం కేసు నమోదు చేసి.. ఇవాళ అరెస్టు చేయడం గమనార్హం. ఇమ్రాన్ ఖాన్ సర్కారును గద్దె దించాలనే లక్ష్యంతో.. వచ్చే నెలలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని విపక్షాలన్నీ ఏకమైన నేపథ్యలో ఈ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది.
రూ. 700 కోట్ల అవినీతి కేసులో విచారణ సందర్భంగా లాహోర్ కోర్టుకు హాజరయ్యారు షహ్‌బాజ్ షరీఫ్. విచారణ చేపట్టిన జస్టిస్ సర్దార్ అహ్మద్ నయీమ్ నేతృత్వంలోని ధర్మాసనం షరీఫ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం ప్రాంగణంలోనే ఎన్ఏబీ.. షరీఫ్‌ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం లాహోర్ నిర్బంధ కేంద్రానికి తరలించారు. ఎన్ఏబీ ప్రత్యేక న్యాయస్థానం ఎదుటు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
షహ్‌బాజ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన 177 అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ సలహాదారు వెల్లడించారు. పార్టీ అధ్యక్ష హోదాలో ఉంటూ టికెట్ ఆశించేవారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.
కుట్రపూరితంగానే..
ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కుట్రపూరితంగా తనపై అక్రమకేసులు బనాయిస్తున్నారని షహ్‌బాజ్ ఆరోపించారు. విపక్షాలు అన్నీ ఏకమై ఖాన్ ప్రభుత్వంపై నిరసన తెలపడం వల్లే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. షరీఫ్ అరెస్ట్‌పై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలవాల్ భుట్టో జర్దారీ ఖండించారు. విపక్షాలు కూటమిగా ఏర్పడిన క్రమంలోనే కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే ఆల్ అజీజీయా మిల్స్ అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆయన.. చికిత్స నిమిత్తం లండన్‌లో ఉంటున్నారు.
ఇదీ చూడండి: క్రియాశీల రాజకీయాల్లోకి నవాజ్ షరీఫ్ పునరాగమనం!