Russia Ukraine War: ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని ఖేర్సన్ నగరాన్ని నిన్న స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు.. ఇవాళ ఎనరోదర్‌లోని జపోరిషియా అణు విద్యుత్తు కేంద్రంపై పట్టు సాధించాయి. తొమ్మిదో రోజు రాజధాని కీవ్ సహా పలునగరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మాస్కో సేనలను ఉక్రెయిన్ బలగాలు గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి. ఎనరోదర్ నగరంలో యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్తు కేంద్రం జపోరిషియాపై రష్యా జరిపిన షెల్లింగ్‌తో ప్లాంటులో మంటలు లేచాయి. షెల్స్ నేరుగా మనుగడలో లేని అణురియాక్టర్‌పై పడటంతో మంటలు లేచినట్లు ప్లాంటు వర్గాలు తెలిపాయి. పరిపాలన శిక్షణా భవనానికి కూడా మంటలు వ్యాపించగా.. సహాయక సిబ్బంది వెంటనే అదుపులోకి తెచ్చినట్లు ప్లాంటు డైరెక్టర్ తెలిపారు. కీలకమైన పరికరాలకు ఏమీ కాలేదని, ప్లాంట్ సురక్షితమని చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు చనిపోగా.. ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు ఎనరోదర్ మేయర్ తెలిపారు. రష్యా దాడి వల్ల ఎలాంటి రేడియేషన్ విడుదల కాలేదని ఉక్రెయిన్‌తోపాటు ఐరాస వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కొన్నిగంటల్లోనే అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారవర్గాలు ప్రకటించాయి. అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేశామన్న ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా.. ఉక్రెయిన్‌లోని విధ్వంసకులపై మాత్రమే దాడి చేసినట్లు పేర్కొంది.
భీకరపోరు..
Russia Invasion: ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యా బలగాల దాడుల తీవ్రత పెరిగింది. క్షిపణులు, రాకెట్లు, ఫిరంగులతో విరుచుకుపడుతున్నాయి. ప్రతిఘటన ఎదురవుతుండగా.. భారీ నష్టం కలిగించే బాంబులను మాస్కో వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. రాజధాని కీవ్ శివార్లలో పోరు భీకరంగా సాగుతున్నట్లు ప్రకటించింది. నగర శివార్లలో తిష్ట వేసిన రష్యా సేనలు.. ఏ క్షణమైనా రాజధాని వైపు వేగంగా కదిలే ప్రమాదం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఓడరేవు నగరం మరియపోల్ శివార్లలోను ఇరు దేశాల సైన్యాల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఉత్తర ప్రాంతంలోని చెర్నిహివ్ నగరంలోని జనావాసాలు, విద్యా సంస్థలపై క్రెమ్లిన్ సేనలు జరిపిన దాడిలో 9మంది మహిళలు సహా 47మంది చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు అక్కడి గవర్నర్ తెలిపారు. పుతిన్ సేనల షెల్లింగ్‌లో ఇర్పెన్ నగరంలోని పలు జనావాసాలు దెబ్బతినగా.. ఖార్కివ్ లోని సాల్టోవ్కా ప్రాంతంలోని గృహ సముదాలు తగులబడ్డాయి.
గట్టి ప్రతిఘటన..
Ukraine War Updates: ఆయా నగరాల్లో క్రెమ్లిన్ సైన్యం ముందుకు కదలకుండా ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు అడ్డుకుంటున్నారు. చెట్లునరికి రోడ్లకు అడ్డంగా వేస్తున్నారు. రష్యా కాన్వాయ్‌లో ముందున్న వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. గో బ్యాక్ యువర్ హోం అంటూ.. రష్యన్ సేనలకు వ్యతిరేకంగా పలు నగరాల్లో ప్రజలు నినదించారు. ఆక్రమణదారులను అడ్డుకునేందుకు.. గెరిల్లా పోరాటానికి సిద్ధం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు రష్యాకు చెందిన 250యుద్ధ ట్యాంక్‌లను, 10వేల మంది సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించుకుంది. ఉక్రెయిన్‌కు తాము అందజేసిన జావెలిన్ మిస్సైళ్లతో 300షాట్లు జరిపి రష్యాకు చెందిన 280సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది.
ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షలపర్వం కొనసాగుతోంది. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ టికెట్ బుకింగ్ నుంచి రష్యా ఎయిర్‌లైన్ సంస్థ ఎయిరోఫ్లాట్‌ను తొలగించారు. రష్యా, బెలారస్‌తో సరిహద్దు సహకార ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన ఐరోపా దేశాలు ఆర్టీకి చెందిన టెలిగ్రామ్ ఛానల్‌ను బ్లాక్ చేశాయి. మరోవైపు ఉక్రెయిన్ పై తక్షణం దాడులు ఆపాలని తొలిసారి రష్యాకు చెందిన దిగ్గజ చమురు సంస్థ లుకోయిల్ డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి: రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓటింగ్... భారత్ దూరం