Russia-Ukraine war: ఉక్రెయిన్ నగరాలపై రష్యా బలగాలు క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నాయి. రాజధాని కీవ్ దిశగా కదులుతున్న పుతిన్ సేనలు వోలిన్ ప్రాంతంలోని లుట్స్క్ వైమానిక స్థావరంపై బాంబులతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఇవానో-ఫ్రాన్కివ్స్క్ సమీపంలోని విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. క్షిపణి దాడుల నేపథ్యంలో ప్రజలెవరూ బంకర్లు వీడి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన డ్నిప్రోలో సైతం శుక్రవారం తెల్లవారుజామున రష్యా మూడు సార్లు వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రష్యా దాడులను, ఉక్రెయిన్ బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. బక్లనోవా మురవికా నగరం నుంచి కీవ్ దిశగా వెళ్తున్న మాస్కో సేనలను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది.
రష్యా సేనల ఆధీనంలో ఉన్న ఖెర్సాన్, ఖార్కివ్, చెర్నిహివ్ నగరాల్లో ప్రజల తరలింపుకు మానవతా కారిడార్‌లు ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెశ్చుక్ వెల్లడించారు. మరియుపోల్ నుంచి ప్రజల తరలింపునకు రష్యా సహకరించడం లేదని ఆరోపించారు. ఇప్పటికీ అక్కడ 4 లక్షల 30 వేల మంది పౌరులు చిక్కుకుని ఉన్నారని తెలిపారు. రష్యా సేనల క్షిపణి దాడుల కారణంగా ప్రజలకు ఆహారం ఇతర సదుపాయాలను తరలించేందుకు విఘాతం కలుగుతోందని చెప్పారు. యుద్ధం కారణంగా మరియుపోల్ ప్రాంతంలో 13వందల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మరియుపోల్ నగర విధుల్లో మంటల్లో తగలబడుతున్న భవనాలు, కార్లు, మృతదేహాల దిబ్బలు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని కోరారు.
మరోవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా రెండు వారాల వ్యవధిలో 26 లక్షల మంది పౌరులు ఉక్రెయిన్‌ను వీడారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వీరిలో దాదాపు 15 లక్షల మందికి పైగా సరిహద్దు దేశమైన పోలాండ్‌కు వలస వెళ్లినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో ఇప్పటివరకు 549 మంది సాధారణ పౌరులు మరణించగా సుమారు వెయ్యి మంది గాయపడ్డారని ఐరాస వెల్లడించింది. మాస్కో క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌లోని 29 ప్రధాన ఆస్పత్రులు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలిపింది.
ఇవీ చూడండి:
వార్ 2.0.. గేర్ మార్చిన పుతిన్.. ఇక విదేశీ ఫైటర్లతో ఉక్రెయిన్‌పై దాడులు!
ఉక్రెయిన్ ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదం
'ప్రపంచానికి మరో వైరస్ ముప్పు'.. ఉక్రెయిన్‌కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!