రష్యన్ వీధులు మళ్లీ నిరసనలతో పోటెత్తాయి. ప్రభుత్వం నిర్బంధించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని విడుదల చేయాలని కోరుతూ ఆదివారం వేలాది మంది పౌరులు వీధుల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనలు క్రెమ్లిన్ భవనాన్ని దడదడలాడించాయి.
అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.
దాదాపు 5000 మందికిపైగా పౌరులను పోలీసులు నిర్బంధించారు. వెల్లువలా వీధుల్లోకి వచ్చిపడ్డ ప్రదర్శనకారులను అదుపు చేసేందుకు అధికారులు నానా అవస్థలు పడ్డారు.
పుతిన్ రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆదివారం జరిగిన ఆందోళనలతో మాస్కోలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. క్రెమ్లిన్ సమీపంలోని సబ్వే స్టేషన్లను మూసివేశారు.
జర్మనీ నుంచి రష్యా వచ్చిన ప్రతిపక్ష నాయకుడు నావల్నీని జనవరి 17న రష్యా పోలీసులు అరెస్టు చేశారు. వచ్చే నెలలో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఒకవేళ ఆరోపణలు రుజువైతే నావల్నీకి దాదాపు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో నావల్నీని విడుదల చేయాలంటూ ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు.
ఖండించిన ప్రపంచదేశాలు..
2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు నావల్నీ ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో గత సంవత్సరం ఆయనపై విషప్రయోగం జరిగింది. అయితే, అధ్యక్షుడు పుతిన్ తనను హత్య చేయించేందుకు ప్రయత్నం చేసినట్లు వచ్చిన ఆరోపణలను క్రెమ్లిన్ ఖండించింది. అయితే, ప్రతిపక్ష నాయకుడి అరెస్టును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.