Robot Station In Russia: అక్కడ రోబోలు అవలీలగా పద్యాలు చెబుతాయి. మన ఒత్తిడి తగ్గించేందుకు మధుర గీతాలు ఆలపిస్తాయి. హాస్య చలోక్తులు విసిరి నవ్వులపువ్వులు పూయిస్తాయి. భవిష్యత్తు సాంకేతికతను 3డీలో చూపి అబ్బురపరుస్తాయి. రష్యా మ్యూజియంలో కట్టిపడేస్తున్న రోబోల విన్యాసాలివి.
రోబోల విన్యాసాలు..
మానవ పరిజ్ఞానం చేసిన అద్భుత ఆవిష్కరణ.. రోబో. ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ రోబోల వినియోగం విస్తృతమవుతోంది. రోబోలపై మరింత అవగాహన కల్పించేందుకు రష్యా రాజధాని మాస్కోలో రోబోస్టేషన్ ఇంటరాక్టివ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. రోబో స్టేషన్‌లో బ్రిటన్, దక్షిణకొరియా, చైనా, జపాన్ సహా వివిధ దేశాలకు చెందిన 40 రోబోలు కొలువుదీరాయి. ఇక్కడ రోబోలు చేసే విన్యాసాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో వినియోగించే రోబోల నుంచి వినోదం పంచే రోబోల వరకు ఈ మ్యూజియంలో ఉన్నాయి.
రోబోలు చెప్పే కవిత్వం, పద్యాలు..
రోబోస్టేషన్ ఇంటరాక్టివ్ మ్యూజియంలో సందర్శకులు రోబోలతో డ్యాన్స్ చేయవచ్చు. రోబోట్‌ల సాంకేతిక సామర్థ్యాలను పరీక్షించవచ్చు. రోబోలు చెప్పే కవిత్వం, పద్యాలను
వినొచ్చు. ఇక్కడి రోబోలు జోకులు చెప్పి నవ్వించగలవు కూడా. తనకు చిన్నారులు, అందమైన అమ్మాయిలతో మాట్లాడడం చాలా ఇష్టమని థెస్పియన్ అనే రోబోట్ తన ఇష్టాన్ని కూడా చెబుతోంది.సందర్శకులు రోబోలను తమతో ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ఈ మ్యూజియంలో రోబోలను అద్దెకు కూడా ఇస్తారు.
రోబోలే అధ్యాపకులై..
ఈ మ్యూజియంలో చేప రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అక్వేరియంలో ఉన్న ఈ రోబోలు.. సముద్రం లోతు, అక్కడి అరుదైన జీవజాలాన్ని గుర్తించేందుకు వినియోగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. పారిశ్రామిక రోబోలు, వన్య ప్రాణులను పోలిన రోబోలు కూడా ఇక్కడ కొలువుదీరాయి.
ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు వచ్చిన విద్యార్థులకు రోబోలే 3డీ మోడలింగ్, ప్రోగ్రామింగ్, డెవలపింగ్ అప్లికేషన్స్, వర్చువల్ డిజైన్ గురించి చెబుతాయి. రోజువారీ జీవితంలో రోబోలు ఎలా సాయపడగలవో వివరిస్తాయి. మ్యూజియంలో భవిష్యత్తు ప్రయోగశాల పేరుతో ఏర్పాటు చేసిన జోన్‌లో భవిష్యత్తు విశ్వం ఎలా ఉండబోతుందో ప్రదర్శిస్తున్నారు.