చైనాలో.. కరోనా పుట్టుకపై పరిశోధనలు జరిపేందుకు డబ్యూహెచ్ఓ బృందం సన్నద్ధమైన తరుణంలో.. పరిశోధనకు ముందు తమతో మాట్లాడాలని వుహాన్‌లోని వైరస్ మృతుడి కుమారుడు విజ్ఞప్తి చేశాడు. జిన్‌పింగ్ ప్రభుత్వం తమ నోళ్లు నొక్కేసిందని ఆరోపించాడు.
"డబ్యూహెచ్ఓ వైద్య బృందం.. అబద్ధాలు చెప్పే ఓ సాధనంగా మారదని నేను అనుకుంటున్నా. మేము నిజం కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నాము. నేరాల్ని కప్పిపుచ్చేందుకే డబ్ల్యూహెచ్ఓ ఇక్కడి వస్తే లాభం లేదు. వుహాన్‌లో నేరానికి పాల్పడ్డారు."
--జాంగ్ హాయి, కరోనా మృతుడి కుమారుడు.
జాంగ్ హాయి వుహాన్‌లో ఉండేవాడు. అతని తండ్రి కరోనా బారిన పడి గత ఫిబ్రవరిలో మరణించాడు. డబ్ల్యూహెచ్ఓ పర్యటన నేపథ్యంలో.. తనలానే బాధకు గురైన వారిని కూడగట్టాడు. తమకు జరిగిన అన్యాయానికి అధికారులు జవాబుదారీతనంతో ఉండాలని తేల్చిచెప్పాడు.
'బయట చెబితే చంపుతాం'
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలినాళ్లల్లో చైనా ప్రభుత్వం కావాలనే ఆ విషయాల్ని బహిర్గతం చేయలేదని జాంగ్ ఆరోపించాడు. వుహాన్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనీ.. వైరస్‌పైన అధిక ప్రచారం చేయవద్దని బాధిత కుటుంబాలపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నాడు.
వైరస్‌పై విదేశీ మీడియాకు చెబితే తమను చంపుతామని అధికారులు బెదిరించనట్టు వివరించాడు.
తలొంచిన డ్రాగన్
డబ్యూహెచ్ఓ వైద్య బృందం ఎప్పుడో వుహాన్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే మొదట చైనా ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. అయితే చైనా చర్యపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవడం వల్ల డ్రాగన్ దేశం తలొంచింది. చివరకు ఎన్నో చర్చల తర్వాత అంగీకరించింది. జనవరి 14న వైద్య బృందం వుహాన్‌కు వెళ్లగా.. 14 రోజల క్వారంటైన్ తర్వాత త్వరలో పరిశోధన ప్రారంభంకానుంది.
ఇదీ చదవండి : కరోనా కట్టడికి చైనా ఆపసోపాలు- రాకపోకలు నిషేధం!