పుల్వామా దాడికి సంబంధించి పాక్ మరో నాటకానికి తెరలేపింది. భారత్ అందించిన జాబితాలోని మొత్తం 22 భౌగోళిక ప్రాంతాల్లో ఎలాంటి ఉగ్రస్థావరాలు లేవని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇచ్చిన జాబితాలోని 54 మందిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపింది. అయితే వాళ్లకు పుల్వామా దాడితో సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదని ప్రకటించింది. దర్యాప్తులో తేలిన ప్రాథమిక అంశాలతో పాటు ప్రశ్నావళిని భారతదేశానికి అందించింది. భారత్ అనుమానిస్తున్న ప్రాంతాలను అధికారులు సందర్శించేలా అనుమతివ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది పాక్.
ఫిబ్రవరి 27న సమర్పించిన భారత్...
పాకిస్థాన్‌లోని పుల్వామా దాడికి బాధ్యులైన జైషే మహ్మద్ ఉగ్రవాదుల స్థావరాలు, నాయకుల వివరాలు దిల్లీలోని పాక్ హైకమిషనర్‌కు ఫిబ్రవరి 27న అందించింది భారత్. పుల్వామా దాడికి బాధ్యులమని 'అదిర్ దర్' ప్రకటిస్తున్న రహస్య వీడియో, 90 మంది అనుమానితులు, 22 ఉగ్రస్థావరాలతో పాటు వీడియోలు షేర్ చేయటానికి ఉపయోగించిన వాట్సాప్, టెలిగ్రాం నంబర్ల వివరాలు అందులో ఉన్నాయి.
ఈ సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది.
భారత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సామాజిక మాధ్యమాలపైనా విశ్లేషణ ప్రారంభించాం. ఫోన్ నంబర్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరాం. వాట్సాప్ నుంచి సహాయం పొందటానికి అమెరికా ప్రభుత్వానికి లేఖ రాశాం. - పాక్ విదేశాంగ కార్యాలయం ప్రకటన.