కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో సఫలమైనట్లు తెలిపేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 ప్రమాద స్థాయులను తగ్గించింది చైనా. దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలను హెచ్చరించారు అధ్యక్షుడు షి జిన్‌పింగ్. కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తి స్థాయిలో కట్టడి కాలేదని.. తప్పనిసరిగా వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు.
కరోనా వైరస్ నివారణ, నియంత్రణ మార్గదర్శక బృందంతో గురువారం సమావేశమయ్యారు అధ్యక్షుడు జిన్‌పింగ్. ఈ బృందం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అయితే.. ప్రజలు వ్యక్తిగత భద్రతపై నిర్లక్ష్యం వహించటం తగదని హెచ్చరించారు.
"విదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటికీ సమర్థవంతంగా కట్టడి కాలేదు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం.. ఈ మహమ్మారి నివారణ చర్యల్లో అనిశ్చితిని కలిగిస్తుంది. హుబే రాష్ట్రంలో ఈ వైరస్ నివారణ, నియంత్రణ చర్యలను సడలించొద్దు."
– షి జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు
చైనాలోని అన్ని ప్రాంతాలు కరోనా ప్రమాద స్థాయులను గురువారం కనిష్ఠ స్థాయికి తగ్గించాయని.. చైనా అధికారిక మీడియా వెల్లడించింది. హుబే రాష్ట్రం సహా.. కరోనాకు కేంద్ర బిందువైన వుహాన్‌లో ఇప్పటికే ప్రమాద స్థాయులను తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపారాలు, పరిశ్రమలు తెరుచుకున్నాయి.
బుధవారం ఒక్కకేసు కూడా నమోదు కాలేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. అయితే.. ఇద్దరు విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది. హుబే ప్రావిన్స్‌లో గత 33 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు.. కాగా బుధవారం లక్షణాలు కనిపించని ఆరుగురికి పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. ఇలాంటి అసిమ్టోమాటిక్ కేసులు 880కు చేరుకున్నాయి. అయితే.. ఒక్క మరణం కూడా సంభవించలేదు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 82,885గా ఉండగా.. మృతుల సంఖ్య 4,633గా ఉంది.