ఇద్దరు బాలికలపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన పాకిస్థాన్లో వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్‌లో జరిగిన ఈ ఘటనపై పాక్ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.
ఇదీ జరిగింది..
పంజాబ్ లాహోర్లోని షాదారాకి చెందిన 16, 18 సంవత్సరాల వయస్సున్న అక్కాచెల్లెళ్లు కుట్టుపని చేస్తుంటారు. వీరు ఓ కస్టమర్ ఇంటి నుంచి దుస్తులు తీసుకొచ్చేందుకు మంగళవారం సాయంత్రం తమ నివాసం నుంచి ఫజల్ పార్కు ప్రాంతానికి రిక్షాలో బయలుదేరి వెళ్లారు. మార్గం మధ్యలో కొందరు దుండగులు తుపాకీతో బెదిరించి.. వీరిని అపహరించారు. సమీపంలోని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి బాలికలపై అత్యాచారం చేశారు. రాత్రంతా ఈ దురాగతానికి పాల్పడిన నిందితులు ఉదయం పారిపోయారని.. తామున్న పరిస్థితిని అతికష్టం మీద పోలీసులకు తెలియజేశామని బాలికలు వివరించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బాధితులిచ్చిన సమాచారం మేరకు ఫ్యాక్టరీ యజమాని సహా.. ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు లాహోర్ పోలీసులు ప్రకటించారు.
ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ పంజాబ్‌లో మహిళలపై దాడులు పెరిగాయి. ఆగస్టు 14న టిక్టాకర్పై జరిగిన అత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. అంతర్జాతీయ సమాజం సైతం దీనిని తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో 400 మంది గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజీలను పరిశీలించి ఇప్పటివరకు 160 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
'మహిళలపై పెరిగిపోతున్న దాడులకు పంజాబ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి.' అని పీఎంఎల్-ఎన్ పంజాబ్ అధికార ప్రతినిధి అజ్మా బుఖారీ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: