పాకిస్థాన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెషావర్ నుంచి 85 కిలోమీటర్లు దూరంలో ఉన్న జియారత్ గఢ్ పర్వతంలోని పాలరాతి గనుల్లో ప్రమాదం జరిగింది. పనులు చేస్తున్న కార్మికులపై పెద్దపెద్ద రాళ్లు పడటం వల్ల 22 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు ఆ దేశ జియో వార్తా సంస్థ పేర్కొంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో అక్కడికక్కడే 12 మంది మరణించగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువమంది కార్మికులు ఉన్నారు. మరికొందరు స్థానికులున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయానికి 45 మంది శ్రామికులు గనులు తవ్వుతున్నట్లు డాన్ వార్తా పత్రిక పేర్కొంది.
ఈ దుర్ఘటన అర్ధరాత్రి జరగడం వల్ల తక్షణమే ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేకపోయినట్లు తెలిపిన అధికారులు... మరుసటి రోజు సహాయకచర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ఘటనే 2015లో జరిగింది. అప్పుడు 12 మృతిచెందారు.
ఇదీ చూడండి: కొవిడ్ నియంత్రణకు కొత్త విధానం!