భారత్ లక్ష్యంగా నిరాధార ఆరోపణలు చేసింది పాకిస్థాన్. దేశం నుంచి పాకిస్థాన్‌కు ప్రవహించే చీనాబ్ నది నుంచి తగిన నీటిని భారత్ వదలడం లేదని ఆరోపించింది. అయితే పాక్ ఆరోపణలను తిప్పికొట్టింది భారత్. దాయాది నిరాధార ఆరోపణలు చేస్తుందని స్పష్టం చేసింది.
హైకమిషనర్‌కు లేఖ..
భారత హైకమిషనర్ ప్రదీప్ కుమార్ సక్సేనాకు బుధవారం లేఖ రాసింది పాక్. మరాలా బ్యారేజ్ నుంచి కిందకు విడులయ్యే నీటిని 31,853 క్యూసెక్కుల నుంచి 18,700 క్యూసెక్కులకు భారత్ తగ్గించిందని ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిందిగా భారత హైకమిషనర్‌ను కోరింది పాక్.
'పరీక్షించి చూసుకోండి'
అయితే పాక్ అభ్యంతరాలపై స్పందించారు సింధూ నదీ జలాల భారత కమిషనర్. పాక్వి నిరాధార ఆరోపణలేనని చెప్పారు. పాక్ చెబుతున్నట్లుగా ఆయా సమయాల్లో ప్రవాహం తగ్గలేదన్నారు. ఒకసారి పరీక్షించి చూసుకోవాలని చెప్పారు.
1960లో ఏర్పడిన సింధూ నదీ జలాల బోర్డుకు ఇరుదేశాల నుంచి కమిషనర్లు ఉంటారు. వారు రెండు దేశాల అధికారిక ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.
'పీఓకే వాతావరణ సూచీ సరికాదు'
ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పుర్, ముజఫరాబాద్, గిల్గిత్ వాతావరణ సూచీలను జమ్ముకశ్మీర్ ప్రాంతీయ వాతావరణ విభాగం వెలువరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది పాక్. ఇది చట్టపరంగా నిరర్థకమైనదని తెలిపింది. ఐరాస భద్రతామండలి మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రభుత్వ ఛానెల్ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో నేటి నుంచి వాతావరణ సూచీలను ప్రసారం చేస్తున్నాయి. దీనిపైనే అభ్యంతరం వ్యక్తం చేసింది పాక్.
అయితే పీఓకేపై పాక్‌ను ఇరుకున పెట్టేవిధంగా వ్యవహరిస్తోంది భారత్. గతేడాది నవంబర్‌లో పీఓకేతో కూడిన భారత మ్యాపును విడుదల చేసింది. ఇందులో పీఓకేను ప్రస్తుత జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో, గిల్గిత్-బాల్టీస్థాన్లను లద్దాఖ్‌లో భాగంగా చేసింది. పీఓకే రాజధానిగా ముజఫరాబాద్‌ను చూపింది.
ఇదీ చూడండి: చైనా బోర్డర్లో కొత్త రోడ్- సైన్యానికి మరింత వెసులుబాటు