చైనాకు వెళ్లి వెతకడం అంటే.. చీకట్లో తడమడం వంటిదే. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బాగా తెలిసొచ్చింది. కరోనా పుట్టు పూర్వోత్తరాలు కనుక్కొంటామంటూ చైనాకు వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ బృందానికి మొదటి నుంచి డ్రాగన్ చుక్కలు చూపించింది. చివరికి ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండా వట్టి చేతులతో వెనక్కి పంపించింది. డబ్ల్యూహెచ్ఓ కూడా చేసేదేం లేక.. ఆ వైరస్ పుట్టుక వూహాన్‌లో జరిగిందనే ప్రచారం చాలా దురదృష్టకరం అంటూ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది.
వాస్తవానికి చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు చెందిన ముడి సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ డేటా ఆధారంగా అసలు వైరస్ పుట్టుకను నిర్ధరించవచ్చు. స్వతంత్ర దర్యాప్తు బృందానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ బృందానికి, చైనా శాస్త్రవేత్తలకు మధ్య చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఒక దశలో ఇరు వర్గాల శాస్త్రవేత్తల మధ్య బిగ్గరగా వాగ్వాదం చోటుచేసుకొంది.
చైనా వాదనను బలపర్చండి..
వైరస్‌కు సంబంధించిన కీలక ఆధారం కనుక్కోవడం డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలకు అత్యంత కష్టంగా మారింది. చైనా తమని అడుగడుగునా అడ్డుకున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. దాదాపు 14 మంది నిపుణులు 27 రోజుల పాటు చైనాలో పర్యటించారు. ఈ క్రమంలో అవసరమైన సమాచారం కోసం ప్రశ్నించిన సమయంలో చైనా అధికారులు, శాస్త్రవేత్తలు తీవ్ర అసహనానికి గురైనట్లు ఈ బృందం వెల్లడించింది. చైనా వాదనను బలపర్చాలని ఆ దేశ అధికారులు.. డబ్ల్యూహెచ్ఓ బృందాన్ని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. 'శీతలీకరణ ఆహారం ద్వారా వ్యాపించింది' అనే సిద్ధాంతాన్ని పరిశీలించాలని, ఇతర దేశాల నుంచి ఈ వైరస్.. చైనాలో వ్యాపించిందని పేర్కొనాలని వెల్లడించారు.
"ఈ దర్యాప్తు మొత్తం భౌగోళిక రాజకీయ సమీకరణలతో నిండిపోయిందన్న విషయం మాకు అర్థమైంది. చైనాపై ఎంత ఒత్తిడి ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసు" అని డబ్ల్యూహెచ్ఓ బృంద సభ్యుడు, డెన్మార్క్‌కు చెందిన ఎపిడమాలజిస్టు డాక్టర్ ఫిష్చెర్ పేర్కొన్నారు. ఇదే బృందంలోని ఆస్ట్రేలియాకు చెందిన మరో నిపుణుడు డోమనిక్ డ్వేయర్ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. "మేము వారిని చాలా సార్లు ఆధారాలు అడిగాం. వారు కొన్ని మాత్రమే ఇచ్చారు. ఇవి విశ్లేషించడానికి ఏమాత్రం సరిపోవు" అని డ్వేయర్ పేర్కొన్నారు. మరోపక్క చైనా సమాచారాన్ని బయటపెట్టడం లేదని ఆస్ట్రేలియా మీడియా, వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాలు వెలువరించింది.
సంక్షిప్త సమాచారమే..
ఈ నేపథ్యంలో చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం రాజీపడి చైనా పారదర్శకతను అభినందిస్తూనే.. వుహాన్‌లో 2019నాటి పరిస్థితిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని పేర్కొంది. కానీ, డబ్ల్యూహెచ్ఓ నిపుణులకు ఈ వ్యూహం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. చైనా అధికారులు ఈ ప్రశంసలకు ఏమాత్రం లొంగలేదు.. ప్రతి రోగి వివరాలను పొందుపర్చేంత సమయం లభించలేదంటూ.. సంక్షిప్త సమాచారాన్ని మాత్రమే నిపుణులకు ఇచ్చారు. వైరస్‌పై కీలకమైన ప్రశ్నలకు ఈ సమాచారం నుంచి ఎటువంటి సమాధానం లభించే పరిస్థితి లేదు.
ఫలితంగా పర్యటన ముగింపు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా ఈ వైరస్ చైనా నుంచి వ్యాపించిందని ఎక్కడా పేర్కొనలేదు. పైగా.. శీతలీకరణ చేసిన ఆహారం నుంచి ఇది వ్యాపించి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేసింది. దీనిపై పరిశోధన చేయాల్సి ఉందని పేర్కొంది. చివరికి ఇది పూర్తిగా చైనాకు అనుకూలంగా మారింది.
2019 అక్టోబర్‌లోనే వైరస్ జాడ..
2019 అక్టోబర్‌లోనే వైరస్ జాడ బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం అనుమానిస్తోంది. ఆ సమయంలో దాదాపు 92 మంది వుహాన్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్లు గుర్తించారు. వీరి లక్షణాలు కొవిడ్-19ను పోలి ఉన్నాయి. కానీ, వారికి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయలేదని డబ్ల్యూహెచ్ఓ బృందం వెల్లడించింది. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు అవసరమని బృందం వెల్లడించింది.
అడుగడుగునా అవాంతరాలే..
అమెరికా-చైనా మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో కరోనావైరస్‌కు రాజకీయ రంగు పులుముకొంది. పశ్చిమ దేశాల ఒత్తిడి ఒక్కసారిగా పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందంతో దర్యాప్తు చేయించేందుకు చైనా అంగీకరించింది. ఆ తర్వాత కూడా దర్యాప్తులోని కీలక అంశాలపై చైనా శాస్త్రవేత్తల ఆధిపత్యం ఉండేట్లు డ్రాగన్.. డబ్ల్యూహెచ్ఓను అంగీకరింపజేసింది.
నిపుణుల బృందం చైనాలో అడుపెట్టడానికి కూడా పెద్ద తతంగం నడిచింది. తీరా చైనా చేరుకొన్న బృందాన్ని రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉంచారు. వారిని కేవలం జూమ్ సమావేశాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ బృంద సభ్యులు క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చైనా శాస్త్రవేత్తలతో కలిసి భోజనం చేయడం, విడిగా మాట్లాడం వంటివి చేయకుండా కట్టడి చేశారు.
అమెరికా అసహనం..
తాజాగా అమెరికా శ్వేత సౌధం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సుల్వైన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జోబైడెన్ బృందం.. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉంచేలా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. డబ్ల్యూహెచ్ఓ.. కొవిడ్19పై ప్రకటన విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'మాస్కు సరిగ్గా ధరిస్తేనే... సంపూర్ణ రక్షణ'