జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వానికి ఉత్తర కొరియా తొలిసారి హెచ్చరికలు పంపింది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను తీవ్రంగా వ్యతిరేకించింది.
వచ్చే నాలుగు సంవత్సరాల పాటు మంచి నిద్ర కావాలనుకుంటే రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని బైడెన్ యంత్రాంగాన్ని హెచ్చరించారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్. లేదంటే సైనిక ఉద్రిక్తతలు తగ్గించేలా 2018లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని సమీక్షించాల్సి వస్తుందని అన్నారు. దక్షిణ కొరియాతో సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన పార్టీ యూనిట్‌ను సైతం రద్దు చేయాల్సి వస్తుందని తేల్చిచెప్పారు.
"దక్షిణ కొరియా వ్యవహారం, వైఖరిపై మేం కన్నేసి ఉంచుతాం. వారు మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే అసాధారణ చర్యలు తీసుకుంటాం. మా దేశంపై మందుగుండు వెదజల్లాలని ఆత్రుతతో ఉన్న అమెరికా నూతన యంత్రాంగానికి ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నా. వచ్చే నాలుగేళ్లు వారు మంచి రాత్రి నిద్ర కోరుకుంటునట్లైతే.. నిద్రను నిరోధించే పనులను తొలి నుంచి చేపట్టకుండా ఉండటం ముఖ్యం."
-కిమ్ యో జోంగ్, కిమ్ సోదరి
దక్షిణ కొరియా, అమెరికా సైన్యాల వార్షిక సంయుక్త విన్యాసాలు గత వారం ప్రారంభమయ్యాయి. గురువారం వరకు ఇవి కొనసాగనున్నాయి.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయ్డ్ ఆస్టిన్ ఆసియా పర్యటనలో ఉన్న వేళ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఉత్తర కొరియా అంశం సహా ప్రాంతీయ సమస్యలపై చర్చించేందుకు.. దక్షిణ కొరియా, జపాన్ దేశాల ప్రతినిధులతో బ్లింకెన్, ఆస్టిన్ సమావేశం కానున్నారు.
ఇదీ చదవండి: కిమ్ జోంగ్ చెల్లెలు అంత శక్తిమంతమా?