ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. నానాటికి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 2.67 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా ధాటికి 8,78,958 మంది మృతిచెందారు. 1.89 కోట్ల మంది కోలుకున్నారు.
అగ్రరాజ్యంలో..
అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజులో 52,853 కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 63.89 లక్షలకు చేరింది. దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 1,92,11 మంది మృత్యువాతపడ్డారు.
బ్రెజిల్లోనూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 45 వేల మందికిపైగా వైరస్ బారినపడగా మొత్తం బాధితుల సంఖ్య 40.91 లక్షలకు పెరిగింది. 1.25 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
నాలుగో స్థానంలో మెక్సికో..
మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య భారీగా ఉంది. 66,851 మరణాలతో అమెరికా, బ్రెజిల్, భారత్ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. కొత్తగా దాదాపు 6 వేల కేసులు నమోదు కాగా.. మొత్తం 6.16 లక్షల మందికి వైరస్ సోకింది.
రష్యాలో స్థిరంగా..
రష్యాలో వైరస్ ఉద్ధృతి తగ్గినా స్థిరంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 5,110 మందికి కరోనా నిర్ధరణ అయింది. దేశంలో మొత్తం బాధితులు 10.15 లక్షల మంది ఉన్నారు. రష్యాలో మరణాల రేటు కూడా అదుపులో ఉంది. ఇప్పటివరకు 17,649 మంది మరణించారు.
వియత్నాంలో ఇలా..
కరోనా కట్టడిలో విజయవంతమై ప్రపంచ దేశాల మన్ననలను పొందుతోంది వియత్నాం. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు అక్కడ ఒక్క కేసు నమోదు కాలేదు. ఇప్పటివరకు వియత్నాంలో మొత్తం 1,049 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పెరూ, చిలీ, కొలంబియా, సౌదీ, బంగ్లాదేశ్, అర్జెంటీనా, ఫిలిప్పీన్స్ దేశాల్లో వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దేశం | మొత్తం కేసులు | మృతులు | కోలుకున్నవారు |
అమెరికా | 63,89,057 | 1,92,111 | 36,35,854 |
బ్రెజిల్ | 40,91,801 | 1,25,584 | 32,78,243 |
రష్యా | 10,15,105 | 17,649 | 8,32,747 |
పెరూ | 6,76,848 | 29,554 | 4,98,523 |
కొలంబియా | 6,50,062 | 20,888 | 4,98,221 |
దక్షిణాఫ్రికా | 6,35,078 | 14,678 | 5,57,818 |
మెక్సికో | 6,16,894 | 66,329 | 4,30,287 |
ఇదీ చూడండి: భారత్లో 'స్పుత్నిక్' టీకా తయారీకి రష్యా చర్చలు