భారత్‌పై ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా మరోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు తాను చేసిన ప్రతిపాదనకు భారత ప్రధాని అప్పట్లో సానుకూలంగా స్పందించలేదని చెప్పుకొచ్చారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా 'ఫారెన్ పాలసీ మేగజిన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్.
గతేడాది ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామా ఘటన అనంతరం మోదీతో సంప్రదింపులు జరిపానని ఇమ్రాన్ అన్నారు. ఈ దాడిలో పాకిస్థాన్‌కు సంబంధించిన వారి పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీకి చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఘటన అనంతరం భారత్... పాక్‌పై దాడికి పాల్పడిందన్నారు.
సైన్యం చర్యలతో రెండు దేశాల మధ్య వివాదాలు పరిష్కారం కావన్నారు ఇమ్రాన్. శాంతి చర్చలతోనే సాధ్యమన్నారు. ప్రపంచంలో ఆసియాలోనే పేదలు అధికంగా ఉన్నారని.. దీనిని నిర్మూలించేందుకు భారత్-పాక్ సంయుక్తంగా కృషి చేయాలన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: చైనాలో భారత గణతంత్ర వేడుకలు రద్దు