శ్రీలంకలో ఆత్మాహుతి దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు భారత్లోని కశ్మీర్, కేరళలో శిక్షణ కోసం వచ్చి వెళ్లినట్లు ఆ దేశ లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ నాయకే నిర్ధరించారు. ఇతర అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకునేందుకూ అయ్యుండవచ్చని ఆయన అన్నారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేనా నాయకే ఈ విషయాలను వెల్లడించారు. ఆత్మాహుతి బాంబర్లు భారత్ సందర్శించారని ఒక సీనియర్ సైనిక అధికారి నిర్ధరించడం ఇదే తొలిసారి.
"ఆత్మాహుతి బాంబార్లు భారత్ వెళ్లారు. అక్కడ కేరళ, బెంగళూరు, కశ్మీర్ల్లో పర్యటించారు. ఈ సమాచారం మా వద్ద ఉంది. వారు శిక్షణ కోసం వెళ్లారు. ఇతర దేశాల ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకోవడానికీ వెళ్లి ఉండొచ్చు." -మహేశ్ సేనా నాయకే, లెఫ్టినెంట్ జనరల్
నిఘా సమాచారం ఉన్నా దాడులను అడ్డుకోలేక పోవడానికి ప్రభుత్వమూ, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సేనానాయకే అభిప్రాయపడ్డారు.
ఇదీ జరిగింది..
ఏప్రిల్ 21న ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంకలోని మూడు చర్చిలు, లగ్జరీ హోటళ్లలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక మహిళ సహా తొమ్మిది మంది ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారు. ఈ నరమేధంలో 253 మంది మరణించగా, 500 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
ఈ దాడికి పాల్పడింది స్థానిక 'నేషనల్ తౌవీద్ జమాత్' (ఎన్టీజే) ఉగ్రవాదులని శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇప్పటికే వంద మంది అనుమానితులను అరెస్టు చేసింది. అయితే ఆ సంస్థ ఈ దాడులకు బాధ్యత వహించలేదు. మరో వైపు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఈ ఉగ్రదాడులకు తామే కారణమని ప్రకటించింది.
ఇదీ చూడండి: వజీరలోంగ్కోర్న్ అను నేను థాయ్ మహారాజుగా...