IND Vs SA T20 Series 2024 : 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత తొలిసారి భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. నవంబర్ 8వ తేదీ శుక్రవారం నుంచి సఫారీల సొంతగడ్డపై నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. డర్బన్‌లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే సొంతగడ్డపై ఆ జట్టును ఎదుర్కొవడం యంగ్ టీమ్ ఇండియాకు అంత సులువు కాదు. టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లకు ఇదే తొలి దక్షిణాఫ్రికా పర్యటన కావడం గమనార్హం. అక్కడి భయంకరమైన పేస్ పిచ్‌లపై ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
మరోవైపు టీమ్ఇండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్ సింగ్ కొన్ని అరుదైన రికార్డులు అందుకునే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సూర్యకుమార్ యాదవ్
2021లో టీ20ల్లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్, చాలా తక్కువ సమయంలోనే అగ్ర స్థానానికి చేరాడు. దక్షిణాఫ్రికాపై ఏడు మ్యాచుల్లో 175.63 స్ట్రైక్ రేట్‌తో 346 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరిగిన టీ20ల్లో డేవిడ్ మిల్లర్ (452 పరుగులు)తో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డును అధిగమించడానికి భారత్ కెప్టెన్‌కి కేవలం 107 పరుగులు మాత్రమే అవసరం.
150 సిక్స్‌ల రికార్డు
సూర్యకుమార్ ఇప్పటి వరకు 74 టీ20 మ్యాచ్‌లు, 71 ఇన్నింగ్స్‌లో 144 సిక్స్‌లు కొట్టాడు. 150 సిక్స్‌ల మార్క్‌ను చేరుకోవడానికి కేవలం ఆరు సిక్సర్లు అవసరం. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 150 సిక్సులు బాదిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
హార్దిక్ పాండ్య
ధోనీ నాయకత్వంలో 2016లో హార్దిక పాండ్య టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 105 మ్యాచుల్లో 87 వికెట్లు పడగొట్టాడు. రాబోయే సిరీస్‌లో టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాండ్య నిలిచే అవకాశం ఉంది. యుజ్వేంద్ర చాహల్ అత్యధిక అంతర్జాతీయ టీ20 వికెట్ల రికార్డు (96 వికెట్లు) బద్ధలు కొట్టడానికి కేవలం 10 వికెట్ల దూరంలో ఉన్నాడు.
అర్ష్‌దీప్ సింగ్
అర్షదీప్ సింగ్ 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 56 మ్యాచుల్లో 87 వికెట్లు సాధించాడు. పాండ్యలాగే చాహల్ రికార్డును అధిగమించడానికి 10 వికెట్ల దూరంలో ఉన్నాడు. అర్ష్‌దీప్ 2024లో టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. 2024 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున 19 వికెట్లు పడగొట్టాడు. అలానే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(17)గా నిలిచాడు. అఫ్ఘానిస్థాన్ బౌలర్ ఫరూకీ కూడా 17 వికెట్లతో అర్ష్‌దీప్‌తో సమానంగా నిలిచాడు.
టీమ్ ఇండియా- సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్.